ఇక గంటల వ్యవధిలోనే ఓమిక్రాన్ ఫలితాలు..
ఓమిక్రాన్ పరీక్షా ఫలితాలు ఇక నుంచి గంటల వ్యవధిలోనే రాన్నున్నాయి. దాదాపు గంటన్నర సమయంలోనే ఫలితం వచ్చే కొత్త పరీక్షా విధానాన్ని ఢిల్లీ ఐఐటీ రూపొందించింది. దీనిపై పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది.
ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదటి సారి వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే ఓమిక్రాన్‌కు కేసులో తొలి బ్రిటన్‌లో మరణం సంభవించింది. దీంతో ఈ కొత్త వేరియంట్ పట్ల ఆందోళన ఎక్కువవుతోంది.
ఓమ్రికాన్ వల్ల ఏప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు - లండన్ సైంటిస్టుల విశ్లేషణ
ఫలితాలు స్పీడ్..
ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండంతో థర్డ్ వేవ్ వస్తుందేమోనని ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఇండియాలో మొట్టమొదటి సారి కర్నాటకలోని బెంగళూరులో తొలి ఓమ్రికాన్ కేసులు గుర్తించారు. ఇప్పటి వరకు అన్ని ప్రకారం కొత్త వేరియంట్ కేసులు ఇండియాలో 49కు చేరాయి. ఈ ఓమిక్రాన్‌కు కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడొక సమస్య ఏర్పడుతోంది. చాలా మందిలో కరోనా పాజిటివ్ అని గుర్తించినా.. అది డెల్టా వేరియంటా ? లేక ఓమిక్రాన్ వేరియంటా ? అని తెలుసుకునేందుకు చాలా సమయంలో పడుతోంది. ఒక్కసారి 3 రోజుల సమయం వరకు కూడా తీసుకుంటోంది. దీని వల్ల పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడం ఆలస్యం అవుతోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు నెమ్మదిస్తున్నాయి. ఫలితం ఆలస్యంగా రావడం వల్ల పేషెంట్‌తో కలిసిన వ్యక్తులు సమాజంలో తిరుగుతున్నారు. దీంతో ఆ కేసులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలా ఓమిక్రాన్ ఫలితాలు తొందరగా వస్తే ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్‌లను క్వారంటైన్ లో ఉంచి, వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ఇప్పటి వరకు ఉన్న పద్దతుల్లో పరీక్ష నిర్వహిస్తే దాని ఫలితం రావడానికి అధిక సమయం పడుతోంది. కొన్ని సార్లు మూడు రోజుల కంటే ఎక్కువే టైం పడుతోంది. ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో ఢిల్లీలోని ఐఐటీ విజయం సాధించింది. దాదాపు గంటన్నర వ్యవవధిలోనే ఫలితాలు వచ్చే ఒక కొత్త పరీక్ష పద్ధతిని కనుగొన్నారు. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేరియంట్‌లో ఏర్పడ్డ ఉత్పరివర్తనాలను గుర్తించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇది ఇంకా మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేదు. ఈ కొత్త విధానంపై పేటెంట్ కోరుతూ ఢిల్లీలోని ఐఐటీ దరఖాస్తు చేసుకుంది. వారి నుంచి పేటెంట్ వచ్చిన వెంటనే దానిని పారిశ్రామికంగా ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కొత్త పద్దతి అందుబాటులోకి వస్తే వేగంగా ఓమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించేందుకు వీలవుతుంది. ఫలితంగా కరోనా కట్టడి కోసం చేపట్టే చర్యల్లో కూడా వేగం పెరుగుతుంది.
2020లో ఇండియాలో కరోనా మొదటి సారి గుర్తించిన సమయంలో కూడా మన దగ్గర టెస్ట్‌లు నిర్వహించేందుకు సరైన పద్దతులు లేవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు. వాటి ఫలితాలు రావడానికి కూడా చాలా టైం పట్టేది. ఆ సమయంలో కూడా ఢిల్లీ ఐఐటీ గొప్ప ముందడుగు వేసింది. ర్యాపిడ్ టెస్టింగ్ విధానం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫలితాలు తొందరగా వచ్చాయి. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టడంలో రోగులను, వారి కాంటాక్ట్‌లను క్వారంటైన్‌లో ఉంచేందుకు ఈ పరీక్షలు ఎంతగానో దోహదపడ్డాయి. ఇప్పుడు ఈ ఓమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు కూడా ఆ యూనివర్సిటే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించడం అభినందించాల్సిన విషయం.