రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ అమలు, చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్న సదుపాయాలను, వసతులను పెంచడానికి ప్రధానంగా దృష్టిపెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

క్రిటికల్ కేర్ కోసం నిర్దేశించిన కోవిడ్ ఆసుపత్రులు, జిల్లాల వారీగా నిర్దేశించుకున్న కోవిడ్ ఆసుపత్రుల సన్నద్ధతపైనా దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. ఈ ఆసుపత్రుల్లో సదుపాయాల్లో నాణ్యత ఉండాలని, రూపొందించుకున్న ఎస్ఓపీ ప్రకారం నాణ్యత పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Also Read:''ఏపి లాక్ డౌన్: జగన్ సర్కార్ చర్యలు భేష్... తమిళ సీఎం అభినందనలు''

వచ్చే సోమవారం నాటికి అనుకున్న ప్రమాణాల ప్రకారం వీటన్నింటిలోనూ వసతులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.

ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు పూర్తయిన తర్వాత ఎవరెవరికి పరీక్షలు నిర్వహించాలన్న దాని పైనా సమావేశంలో చర్చించారు.

Aslo Read:మంచి ఫుడ్ పెడతారా... పారిపోవాలా..? కరోనా రోగుల బెదిరింపులు

కుటుంబ సర్వేద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ విశాఖలో నిర్వహించిన పద్ధతిలో ర్యాండమ్ సర్వేలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు వరి, మొక్కజోన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని.. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు జగన్‌కి చెప్పారు. అక్కడక్కడా అకాల వర్షాలపై ఆరాతీసిన సీఎం. సంబంధిత రైతులను గుర్తించి వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.