''ఏపి లాక్ డౌన్: జగన్ సర్కార్ చర్యలు భేష్... తమిళ సీఎం అభినందనలు''

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోడానికి చేసిన ఏర్పాట్లను తమిళనాడు సీఎం పళనిస్వామి అభినందించినట్లు సహాయక శిబిరాల నోడల్‌ అధికారి పీయూష్‌కుమార్‌ తెలిపారు. 

AP Lockdown... tamilnadu cm palani swamy reacts on jagan govt arrangements

అమరావతి: లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏపీ వ్యాప్తంగా 393 సహాయక శిబిరాలను దాదాపు 21,025 మందికి వసతి కల్పించే ఏర్పాటు చేశారు. ఇలావలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంప్‌లను రాష్ట్ర వాణిజ్య పన్నుల చీఫ్‌ కమిషనర్, సహాయక శిబిరాల నోడల్‌ అధికారి పీయూష్‌కుమార్‌ సందర్శించారు.

ఈ శిబిరాల్లో రాష్ట్రానికి చెందిన వారు 12,820,ఇతర రాష్ట్రాలకు చెందినవారు 8,205 మందికి ఆశ్రయం కల్పించనున్నారు. వీరికి 95 ఎన్‌జీవో సంస్థలు సేవలు అందించనున్నాయి.  సహాయక శిబిరాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో శిబిరాల్లోని వారికి పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో పనుల్లేక చిక్కుకుపోయిన వలస కూలీలకు వసతి ఏర్పాట్లలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ రోల్‌ మోడల్‌గా నిలుస్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన వారికి కూడా జిల్లాల వారి గా ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి వారందరికీ పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.  సహాయక శిబిరాల్లో ఏర్పాట్లపై స్వయంగా  ముఖ్యమంత్రి జగనే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
 
ఈ సందర్భంగా పీయూశ్ కుమార్ మాట్లాడుతూ... 12,820 మంది ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు పనుల మీద వచ్చి చిక్కుపోయిన వారు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 8,205 మంది ఉన్నట్లు తెలిపారు. మొత్తం 23 రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఈ శిబిరాల్లో ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 1,334, తమిళనాడు 1,198, జార్ఖండ్‌ 918, బిహార్‌ 735 మంది ఉన్నారు. 

ఏపిలో తమిళనాడు ప్రజలకు చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తంచేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ట్విట్టర్‌ ద్వారా ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపినట్లు వెల్లడించారు.

 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 393 సహాయక శిబిరాలు ఏర్పాటుచేస్తే అందులో ఒక్క కృష్ణాజిల్లాలోనే 106 శిబిరాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.  ఇక్కడ అత్యధికంగా 7,061 మంది కూలీలు ఉన్నారని... అత్యల్పంగా వైఎస్సార్‌ జిల్లాలో నాలుగు శిబిరాలు ఏర్పాటుచేశామన్నారు. ఈ శిబిరాల్లో భౌతిక దూరం పాటించేలా పడకలు ఏర్పాటుచేశామని... అలాగే అల్పాహారం, భోజనంతో పాటు ఉడకపెట్టిన కోడిగుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు పీయూష్‌కుమార్‌ వివరించారు.ఈ శిబిరాలను నిరంతరాయంగా పర్యవేక్షించడానికి అధికారులను నియమించామని ఆయన తెలిపారు. 

కేవలం ప్రభుత్వమే కాకుండా 95 ఎన్‌జీవో సంస్థలు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు. ఈ శిబిరాల్లో ఉండే వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై శిబిరాల్లో ఉన్నవారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు  పీయూష్‌కుమార్‌ వెల్లడించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios