ఒకప్పుడు పాన్‌ కార్డ్ గురించి కేవలం కొందరికి మాత్రమే అవగాహన ఉండేది. కానీ ప్రస్తుతం బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరకీ ప్యాన్ కార్డ్‌ తప్పనిసరిగా మారింది. రూ. 50 వేలకు మించి లావాదేవీలు చేస్తే కచ్చితంగా పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే.ఇంతకీ పాన్‌ కార్డ్‌ ఉపయోగం ఏంటి.? అసలు పాన్‌ కార్డులను ఎప్పుడు తీసుకొచ్చారు.? ఎలా అప్లై చేసుకోవాలి.? ఇలా సమగ్ర సమాచారం మీకోసం..  

పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌)గా పిలిచే ఈ కార్డు భారతదేశంలో ప్రతీ పౌరుడికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక డాక్యుమెంట్స్‌లో పాన్‌ కార్డ్‌ ఒకటి. పాన్‌ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు మొదలు, ట్యాక్స్‌ చెల్లింపుల వరకు పాన్‌ కార్డ్‌ అవసరం. పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని సేకరించేందుకు ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రతి పన్ను చెల్లింపుదారునికి ఒక ప్రత్యేక నెంబర్‌ కేటాయిస్తారు. పాన్ కార్డును జారీ చేయడం ద్వారా, ఆదాయపు పన్ను శాఖ ప్రతి పన్ను చెల్లింపుదారుని ఆర్థిక లావాదేవీలను సులువుగా సేకరించి సమీక్షిస్తుంది. వారి ఆర్థిక లావాదేవీలు ప్రతి వ్యక్తి లేదా కంపెనీ పేరు మీద పాన్ కార్డ్ నంబర్‌లో నమోదు చేస్తారు. ఈ విధంగా ఆదాయపు పన్ను శాఖ అన్ని పన్ను సంబంధిత సమాచారాన్ని సులభంగా ధృవీకరించవచ్చు అలాగే పన్ను ఎగవేతను నిరోధించవచ్చు. పాన్ కార్డును ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఇదే. అక్రమ లావాదేవీలు, నల్లధనాన్ని నిరోధించే లక్ష్యంతో ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ నిబంధనలను రూపొందించింది.

పాన్ కార్డ్‌ను మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు.? 

పాన్ కార్డ్ పాన్ దేశంలో మొదటిసారిగా 1972లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పాన్‌ను 1976లో చట్టబద్ధం చేశారు. అప్పటి వరకు ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు సాధారణ సూచిక రిజిస్టర్ నంబర్ లేదా GIR నంబర్‌ను జారీ చేసేది. 1985 వరకు పాన్ కార్డ్ నంబర్లను మ్యానువల్‌గా జారీ చేశారు. అయితే ఈ నంబర్లు ప్రామాణికమైనవి కావని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ విధానంలో పాన్ నంబర్ల జారీని నిలిపివేశారు. అనంతరం అమెరికా, బ్రిటన్ వంటి వివిధ దేశాల్లో పాన్ కార్డు తరహాలో ఉండే విధానాన్ని అధ్యయనం చేసిన తర్వాత 1995లో ప్రస్తుత పాన్ కార్డును ప్రవేశపెట్టారు.

తొలినాళ్లలో ఆదాయపు పన్ను చెల్లించేందుకు, ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేసేందుకు మాత్రమే పాన్‌కార్డును ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు అన్ని రోజువారీ ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ కావాల్సి వస్తోంది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన 10-అంకెల సంఖ్యలో కార్డు హోల్డర్‌కి సంబంధించిన పలు వివరాలు ఉంటాయి. అదే విధంగా పాన్‌ కార్డుపై నెంబర్‌తో పాటు పాన్ కార్డ్‌లో కార్డ్ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా జీవిత భాగస్వామి పేరుతో పాటు ఫోటో ఉంటుంది. ఈ కారణంగానే పాన్‌ కార్డును ఐడీ కార్డుగా పరిగణిస్తుంటారు. 

ఒక వ్యక్తికి పాన్‌ కార్డ్‌ ఒకసారి మాత్రమే జారీ చేస్తారు. ఒక వ్యక్తి ఒక పాన్ నంబర్ మాత్రమే కలిగి ఉంటాడు. పాన్‌ కార్డుపై ఉండే నెంబర్‌లో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. పాన్‌ కార్డులో 5 అక్షరాలు, 4 సంఖ్యలు చివరికి మరో లెటర్‌ ఉంటుంది. ఇలా పాన్‌లో మొత్తం 10 నెంబర్లు ఉంటాయి. అయితే పాన్‌కార్డుపై ఉండే ఈ నెంబర్‌లో ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఇంతకీ పాన్‌ కార్డు నెంబర్‌లో ఉండే అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

P- ఒకే వ్యక్తి

F- సంస్థ

C- కంపెనీ

A- AOP (అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్)

T- ట్రస్ట్

H- HUF (హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ)

B- BOI (బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్)

L- లోకల్

J- ఆర్టిఫీయల్ జ్యూడిషియల్ పర్సన్ న్యాయవ్యక్తి

G- ప్రభుత్వం

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ నాలగ్వ అక్షరం Pగా ఉంటుంది. పాన్ కార్డ్ మొదటి 3 అక్షరాలు అక్షర శ్రేణి రూపంలో ఉంటాయి. ఇది AAA నుంచి ZZZ రూపంలో ఉంటాయి. నాల్గవ అక్షరం ఆ నంబర్ వ్యక్తిదా, సంస్థదా లేక ఏదైనా కంపెనీకి చెందిందా, లేదా ట్రస్ట్‌కు సంబంధించిందా అన్న విషయాన్ని చెబుతుంది. పాన్‌కార్డ్‌లోని 5వ అక్షరం కార్డ్‌ హోల్డర్‌ ఇంటి పేరులోని మొదటి అక్షరం. ఇది పాన్ కార్డ్ హోల్డర్‌ ను బట్టి మారుతుంటుంది. ఇందులో హోల్డర్ ఇంటిపేరు మాత్రమే కనిపిస్తుంది. 

ఇక చివరి 4 అక్షరాల విషయానికొస్తే.. ఈ నంబర్‌లు 0001 నుంచి 9999 వరకు ఏదైనా కావచ్చు. మీ పాన్ కార్డ్ నంబర్‌లు ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో అమలవుతున్న సిరీస్‌ని సూచిస్తాయి. చివరి డిజిట్ విషయానికొస్తే ఆల్ఫాబెట్ చెక్ డిజిట్, ఇది ఏదైనా అక్షరం కావచ్చు.

భిన్న లింగ సంపర్కుల కోసం పాన్ కార్డ్..

2018లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ భిన్న లింగ సంపర్కులు పాన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. దరఖాస్తులో పురుష, స్త్రీ కాలమ్‌లతో పాటు ట్రాన్స్‌జెండర్ కాలమ్ కూడా వచ్చింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 139A, 2955 ఆధారంగా కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ఇది భిన్న లింగ సంపర్కులు పాన్‌కార్డ్ పొందడం సులభతరం చేసింది.

పాన్ కార్డ్ దేనికి తప్పనిసరి?

ప్రస్తుతం దేశంలో పాన్ కార్డ్ ఉపయోగాలు ఏమిటి? పాన్ కార్డ్ కోసం తప్పనిసరి అవసరాలు ఏమిటి?

* రూ.50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంకులో పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాలి.

* రూ.50,000 కంటే ఎక్కువ డ్రాఫ్ట్‌ల కోసం దరఖాస్తు చేసినప్పుడు పాన్ కార్డ్ తప్పనిసరి.

* క్రెడిట్ కార్డ్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి పథకాలకు దరఖాస్తు చేసేటప్పుడు పాన్ కార్డ్ అవసరం.

* రూ. లక్షకు పైబడిన ఆస్తులకు సంబంధించిన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి.

* ఐదు లక్షల కంటే ఎక్కువ విలువైన భూమిని కొనుగోలు చేసినా లేదా విక్రయించినా పాన్ కార్డు అవసరం.

* మోటారు వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు పాన్ కార్డ్ సమాచారాన్ని అందించాలి

* ఎగుమతి లేదా దిగుమతి చేసేటప్పుడు పాన్ కార్డ్ తప్పనిసరి

* రూ.25,000 కంటే ఎక్కువ విదేశీ ప్రయాణానికి పాన్ కార్డ్ అవసరం

ఎన్ని రకాల పాన్ కార్డులు ఉన్నాయి?

దేశంలో ఒక పౌరుడు ఒక పాన్ కార్డు మాత్రమే కలిగి ఉంటాడని తెలిసిందే. అయితే పాన్‌ కార్డ్‌ల్లో పలు రకాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఎన్ని రకాల పాన్ కార్డులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

* దేశంలోని ప్రతి వ్యక్తికి పాన్ కార్డ్

* దేశంలోని కంపెనీలకు పాన్ కార్డ్

* విదేశీ పౌరులకు పాన్ కార్డ్

* విదేశీ కంపెనీలకు పాన్ కార్డ్

వ్యక్తుల కోసం జారీ చేసే పాన్‌ కార్డుల్లో వ్యక్తి ఫోటో, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, సంతకం, క్యూఆర్ కోడ్, పాన్ జారీ చేసిన తేదీతో పాటు పాన్ నంబర్‌ ఉంటుంది. కంపెనీలకు జారీ చేసిన పాన్‌ కార్డుల్లో కంపెనీ పేరు, రిజిస్ట్రేషన్ తేదీ, పాన్ నంబర్, క్యూఆర్ కోడ్‌తో పాటు పాన్ జారీ తేదీని ముద్రిస్తారు. కానీ ఇందులో వ్యక్తిగత పాన్ కార్డ్ లాగా ఫోటో లేదా సంతకం ఉండదు.

పాన్ కార్డ్ గడువు ఎప్పుడైనా ముగుస్తుందా? రెన్యూవల్ చేయించుకోవాలా?

ఒక వ్యక్తి పాన్ కార్డును కలిగి ఉంటే, అది జీవితాంతం చెల్లుతుంది. దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. పాన్ కార్డును రద్దు చేయడం అనేది ఆ పాన్ కార్డును కలిగి ఉన్న వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే అవుతుంది. అంటే ఒకసారి జారీ చేసిన పాన్ కార్డ్ మీ జీవితకాలానికి సరిపోతుందన్నమాట. మీ పాన్‌కార్డ్‌ ఎక్స్‌పైరీ అయిందంటూ ఎవరైనా కాల్స్‌, మెసేజ్‌లు చేస్తే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కార్డ్‌ వివరాలను షేర్‌ చేయకూడదని చెబుతున్నారు. కార్డులోని సమాచారాన్ని ఉపయోగించి మోసం చేసే అవకాశం ఉంటుంది. 

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139A ప్రకారం, ఒక వ్యక్తి ఒక పాన్ కార్డ్‌ను మాత్రమే కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుంది. మీ పేరుపై ఇప్పటికే పాన్ కార్డ్ జారీ అయి ఉంటే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోలేరు. ఇలా చేయడం సెక్షన్‌ 139A ఉల్లంఘన కిందికి వస్తుంది. 

పాన్ కార్డును ఎప్పుడు సరెండర్ చేయాలి?

కొన్ని సందర్భాల్లో పాన్ కార్డును సరెండర్ చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు మీరు ఒకటి కంటే ఎక్కువ కార్డులను కలిగి ఉన్నా, పాన్‌ కార్డులోని తప్పుడు వివరాలు ఆదాయపు పన్ను శాఖ ఆమోదించిడం వంటి ఇతర కారణాలతో పాన్‌ కార్డును సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం వాడుకలో ఉన్న మీ పాన్‌ను ఎలా సరెండర్ చేయాలి?

1. ఆదాయపు పన్ను శాఖ అధికారిక NSDL పోర్టల్‌కి వెళ్లాలి. అనంతరం 'PAN కార్డ్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి'పై క్లిక్ చేయాలి. 

2. తర్వాత, 'అప్లికేషన్ టైప్' విభాగంలో 'ఎక్సిస్టింగ్ పాన్ డేటాలో కరెక్షన్'ను సెలక్ట్ చేసుకోవాలి. 

3. దీంతో PAN రద్దు ఫామ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అవసరమైన వివరాలను ఫిల్‌ చేసి, మీరు సరెండర్ చేయాలనుకుంటున్న పాన్ కార్డ్ వివరాలను పేర్కొనాలి. 

4. చివరికి సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.

5. చివరగా ఫీజు చెల్లించాలి. భవిష్యత్తు ప్రయోజనాల కోసం అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే ఏమి చేయాలి?

ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండకూడదు. ఆదాయపు పన్ను శాఖ ఒక్కొక్కరికి ఒక పాన్ కార్డు మాత్రమే జారీ చేస్తుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను కలిగి ఉంటే, అది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా పరిగణించి జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే జరిమానా ఏమిటి?

ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉన్నట్లయితే, ఆదాయపు పన్ను శాఖ వారిపై ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 272B ప్రకారం విచారణను ప్రారంభించవచ్చు. ఈ చట్టం ప్రకారం వ్యక్తికి రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. 

పాన్ కార్డు మార్చుకోవచ్చా?

పాన్ కార్డ్‌లో ఏదైనా మార్పు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్‌సైట్ ద్వారా చేయాలి. లేదా UTISL పోర్టల్ ద్వారా చేయవచ్చు

పిల్లలకు పాన్ కార్డు అవసరమా?

PAN కార్డ్ తరచుగా ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి అవసరమైన పత్రంగా లేదా KYCని పూర్తి చేయడానికి అవసరమైన రుజువుగా ఉపయోగిస్తుంటారు. పాన్ కార్డ్ పెద్దలకు మాత్రమే కాదు. 18 ఏళ్ల లోపు మైనర్లు కూడా పాన్ కార్డు పొందవచ్చు. అయితే దీని కోసం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, 18 ఏళ్లు నిండిన తర్వాత, మైనర్‌లకు జారీ చేయబడిన పాన్ కార్డ్‌లో వారి ఫోటో లేదా సంతకం ఉండదు కాబట్టి, వారి పాన్ కార్డ్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

పిల్లలకు పాన్ కార్డ్ ఎప్పుడు అవసరం?

1. పెట్టుబడి: మీరు పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టినట్లయితే

2. పెట్టుబడులకు నామినీ: మీ పెట్టుబడి కోసం మీ బిడ్డను నామినేట్ చేయడానికి.

3. బ్యాంక్ ఖాతాలు: మీరు మీ పిల్లల పేరు మీద బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు.

4. ఆదాయం: మైనర్‌కు ఆదాయ వనరు ఉంటే.

పిల్లల కోసం పాన్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి.?

ఆన్‌లైన్ అప్లికేషన్

1. ఆదాయపు పన్ను శాఖ అధికారిక NSDL వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఫారమ్ 49Aని డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

2. ఫామ్‌ 49Aని ఫిల్‌ చేయాలి. ఫామ్‌ ఫిల్‌ చేసే సమయంలో సూచనలను జాగ్రత్తగా చదవి అన్ని వివరాలను ఎంటర్‌ చేయాలి. 

3. పిల్లల జనన ధృవీకరణ పత్రం, అవసరమైన పత్రాలతో పాటు తల్లిదండ్రుల ఫోటోను అప్‌లోడ్ చేయాలి. 

4. తల్లిదండ్రుల సంతకాన్ని అప్‌లోడ్ చేసి చివరిగా ఫీజును చెల్లించాలి. 

5. చివరికి అప్లికేషన్‌ ఫామ్‌ను సబ్‌మిట్‌ చేసిన రసీదు సంఖ్యను పొందాలి. 

6. ధృవీకరణ తర్వాత, మీరు 15 రోజులలోపు PAN కార్డ్‌ని అందుకుంటారు.

పాన్‌కార్డ్‌ని ఎవరైనా దుర్వినియోగం చేశారా? ఎలా తెలుసుకోవాలి.? 

పాన్ కార్డులో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కొందరు సైబర్‌ నేరగాళ్లు పాన్‌ కార్డు సమాచారాన్ని ఉయోగించి ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ పాన్ సమాచారం ఇలా దుర్వినియోగమైందని అనుమానం వస్తే వెంటనే పరిష్కరించడం అత్యవసరం. కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రకమైన దుర్వినియోగాన్ని ముందుగానే గుర్తించాలి. పాన్ కార్డు విషయంలో ఎలాంటి మోసాలు జరుగుతాయో పూర్తి కథనం ఇక్కడ చూడండి. 

మీ PAN దుర్వినియోగం అవుతుందో లేదో ఎలా గుర్తించాలి?

మీ పాన్ నంబర్ దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ మార్గాలు ఉన్నాయి.. 

* బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లులతో సహా మీ మొత్తం ఆర్థిక సమాచారాన్ని ఖచ్చితంగా ట్రాక్ చేయండి. మీకు తెలియని లావాదేవీలు జరుగుతున్నాయో లేదో గమనించండి. 

* మీ క్రెడిట్ నివేదికను పర్యవేక్షించండి. దీని కోసం CIBIL లేదా ఏదైనా ఇతర క్రెడిట్ బ్యూరో నుంచి మీ క్రెడిట్ నివేదికను తనిఖీ చేయండి.

* అనుమానాస్పద లేదా అనధికారిక లావాదేవీలు గుర్తించబడితే, క్రెడిట్ బ్యూరో లేదా సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించండి.

* ఆదాయపు పన్ను ఖాతాను తనిఖీ చేయండి. దీని కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

* మీకు తెలియని మీ పేరు మీద ఏదైనా ఆర్థిక లావాదేవీ జరుగుతోందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ ఫారమ్ 26AS వివరాలను కూడా చెక్‌ చేసుకోవచ్చు. 

పాన్ కార్డ్ దుర్వినియోగం అయితే ఎలా ఫిర్యాదు చేయాలో పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

పాన్ నంబర్ దుర్వినియోగమైతే ఏం చేయాలి?

ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే మీ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు నివేదించండి. వారు సమస్యను పరిశోధించడంలో మీకు సహాయపడగలరు. మీ పాన్ కార్డ్ దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు మీ వద్ద ఉంటే, మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. అంతేకాకుండా, పాన్ కార్డ్ దుర్వినియోగానికి సంబంధించి అనుమానం ఉంటే ఆదాయపు పన్ను శాఖను సంప్రదించాలి. దీని కోసం మీరు వారి కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్‌ని ఉపయోగించవచ్చు.

ఎలా నివేదించాలి?

* NSDL అధికారిక పోర్టల్‌ని సందర్శించండి

* హోమ్ పేజీలో కస్టమర్ కేర్ విభాగాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి, అందులో డ్రాప్-డౌన్ మెను ఉంటుంది.

* డ్రాప్-డౌన్ మెను నుంచి 'ఫిర్యాదులు/విచారణలు' ఎంపిక చేసుకోవాలి. 

* ఫిర్యాదు ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను ఫిల్‌ చేయాలి. అనంతరం క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి 'సబ్‌మిట్‌' బటన్‌పై నొక్కాలి. 

పాన్‌-ఆధార్‌ లింక్‌.. 

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే మీ పాన్‌ కార్డ్ పనిచేయదు. పాన్ కార్డు ఇన్‌యాక్టివ్‌గా మారితే ఆర్థిక లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు, రూ.1000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం వంటి కొన్ని సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా అడ్డంకులను ఎదుర్కోవచ్చు. షేర్లు కొనడం లేదా అమ్మడం సాధ్యం కాదు. పాన్ డియాక్టివేట్‌ అయితే కొన్ని ఆర్థిక లావాదేవీలు ఆగిపోతాయి. 

పాన్‌ యాక్టివేట్‌ లేకపోతే ఈ 10 పనులు చేయలేరు.. 

i) బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఖాతా తెరవడం కష్టమవుతుంది.

ii) క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. 

iii) డీమ్యాట్ ఖాతా ఓపెన్‌ చేయలేర. 

iv) హోటల్ లేదా రెస్టారెంట్‌లో రూ.50,000 కంటే ఎక్కువ బిల్లు చెల్లించలేరు. 

v) విదేశీ కరెన్సీ కొనుగోలు చేయలేరు. 

vi) మ్యూచువల్ ఫండ్‌కి రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడం వీలుకాదు. 

vii) డిబెంచర్లు లేదా బాండ్ల సముపార్జన కోసం రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం చెల్లించలేరు. 

viii) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్ల కొనుగోలు కోసం రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం చెల్లించడం వీలుకాదు. 

ix) బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఒక రోజులో రూ.50,000 కంటే ఎక్కువ డిపాజిట్లు చేయలేరు. 

x) ఒక రోజులో రూ.50,000 కంటే ఎక్కువ మొత్తానికి బ్యాంక్ డ్రాఫ్ట్‌లు లేదా పే ఆర్డర్‌లు లేదా చెక్కుల కొనుగోలు చేయలేరు. 

పాన్ కార్డ్ పోతే ఏం చేయాలి?

ఒకవేళ మీ పాన కార్డును పోగొట్టుకుంటే.. మళ్లీ అప్లై చేసుకుంటే డూప్లికేట్‌ కార్డును పొందొచ్చు. పాన్‌కార్డ్‌ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే మీ స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత డూప్లికేట్‌ పాన్‌ కార్డ్‌ కోసం అప్లై చేసుకోవాలి. ఇందుకోసం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్‌ ఇవే. పాన్ కార్డు పోతే డూప్లికేట్ పాన్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. 

1. ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి (https://www.protean-tinpan.com/)

2. "చేంజేస్‌ ఇన్‌ ప్రజంట్‌ పాన్‌ కార్డు' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. 

3. మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి. వెంటనే మీకు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. ఇది రిజిస్టర్ మెయిల్‌కు వెళ్తుంది. 

4. “వ్యక్తిగత వివరాలు”పై క్లిక్ చేసి, ఇ-కెవైసి లేదా ఇ-సైన్ ద్వారా అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించాలి. 

5. మీ వివరాలను ధృవీకరించడానికి మీ ఓటరు ID కార్డ్, పాస్‌పోర్ట్, SSLC సర్టిఫికేట్ మొదలైన వాటి కాపీని NSDL కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. 

6. e-KYC కోసం ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

7. E-PAN లేదా ఫిజికల్ పాన్‌లలో మీకు కావాల్సిన దాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి. 

8. మీ చిరునామాను ఫిల్‌ చేసి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 

9. భారతదేశంలోని నివాసితులు ప్రస్తుతం రూ. 50, విదేశాల్లో ఉన్నవారు రూ. 959 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 

10. మీరు 15 నుంచి 20 రోజుల్లో మీ ఫిజికల్‌ పాన్‌కార్డును అందుకుంటారు. 

11. E-PAN కార్డ్ కేవలం 10 నిమిషాల్లోనే సొంతం చేసుకోవచ్చు. దీనిని డిజిటల్ కాపీగా కూడా చేసుకోవచ్చు. 

బంగారం కొనడానికి పాన్ కార్డ్ అవసరమా? 

మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (PMLA) ప్రకారం నగదుతో బంగారం కొనుగోలును నియంత్రించేందుకు ప్రభుత్వం నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం, ఒక కస్టమర్ రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారాన్ని నగదు రూపంలో కొనుగోలు చేస్తే, ఖాతాదారుడి KYC, పాన్ కార్డు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. 
ఆదాయపు పన్ను నిబంధనలు నిర్దేశించిన పరిమితులకు మించి నగదు లావాదేవీలను అనుమతించవు. 

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు రూ.2 లక్షల కంటే ఎక్కువ చెల్లించి బంగారం కొనుగోలు చేయలేరు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271డి ప్రకారం, పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ. 2 లక్షలకు పైబడిన బంగారం కొనుగోలు చేసేందుకు పాన్ కార్డు లేదా ఆధార్ తప్పనిసరి. ఆదాయపు పన్ను నిబంధనలు, 1962లోని రూల్ 114B ప్రకారం, రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీల కోసం బంగారం కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి.

పాన్ 2.0..

ప్రస్తుత పాన్ కార్డ్ సాఫ్ట్‌వేర్ 15 నుంచి 20 సంవత్సరాల క్రితం నాటిది. దీనిని అప్డేట్‌ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0ని అమలు చేయాలని నిర్ణయించింది. ఆదాయపు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్ ఆమోదంతో, QR కోడ్ సదుపాయంతో కొత్త పాన్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1435 కోట్లు ఖర్చు చేస్తోంది. పాన్ 2.0కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

కొత్త పాన్ కార్డ్ ఎలా పొందాలి?

ప్రస్తుతం పాన్‌ కార్డును ఉపయోగిస్తున్న వారంతా కొత్త పాన్‌ కార్డులను పొందుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కార్డు యజమాని చిరునామాకు డెలివరీ చేస్తారు. పాన్ కార్డు లేని వారు కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు 78 కోట్ల పాన్‌లు పంపిణీ చేయగా, అందులో 98 శాతం పాన్‌లు వ్యక్తిగత స్థాయిలో పంపిణీ అయ్యాయి. 

QR కోడ్‌తో రీప్రింటెడ్ పాన్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి

స్టెప్‌ 1: మొదట పోర్టల్‌ని సందర్శించండి https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html

స్టెప్‌2: పాన్, ఆధార్, పుట్టిన తేదీ మొదలైన అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయాలి. అనంతరం సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి. 

స్టెప్‌ 3: వెంనే స్క్రీన్‌పై కొత్త వెబ్‌పేజీ ఓపెన్‌ అవుతుంది. మీరు నమోదు చేసిన వివరాలు సరైనవో కాదో చెక్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీ పొందడానికి క్లిక్‌ చేయాలి. OTP మొబైల్‌తో పాటు ఇమెయిల్‌కు కూడా వస్తుంది. 

స్టెప్‌ 4: ఈ ఓటీపీకి కేవలం 10 నిమిషాల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ఓటీపీ ఎంటర్‌ చేసి క్లిక్‌ చేయాలి. 

స్టెప్‌5: ఓటీపీ వెరిఫికేషన్‌ పూర్తికాగానే పేమెంట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. QR కోడ్‌ని ఉపయోగించి పాన్ కార్డ్ రీప్రింట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు రూ.50 చెల్లించాలి. చివరిగా 'టర్మ్స్ అండ్‌ కండిషన్స్‌'ను అంగీకరిస్తున్నట్లు టిక్‌ బాక్స్‌ను సెలక్ట్‌ చేసుకొని సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

స్టెప్‌6: ఫీజు చెల్లించిన తర్వాత రసీదు వస్తుంది. 24 గంటల తర్వాత NSDL వెబ్‌సైట్ నుంచి e-PAN డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. కాబట్టి ఈ రిసీప్ట్‌ను అలాగే ఉంచుకోవాలి. కొత్త PAN కార్డ్ 15-20 రోజులలోపు మీ అడ్రస్‌కు వస్తుంది. 

నాన్-రెసిడెంట్స్ కోసం పాన్ కార్డ్

పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసి వచ్చినా లేదా దేశంలో ఏదైనా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలన్నా విదేశాల్లో ఉన్న వారికి కూడా పాన్‌ కార్డ్ కచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇలా వారు అవసరమైన పత్రాలు, నిర్ణీత రుసుముతో పాటు ఫారమ్ నం. 49Aని సమర్పించడం ద్వారా నాన్ రెసిడెంట్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్ కార్డ్ సేవా కేంద్రాల ద్వారా లేదా UTIISL ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లోనే మార్పులు.. 

ఒకవేళ పాన్‌ కార్డులో పేరు గానీ, ఫొటో గానీ, అడ్రస్‌లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. అయితే ఇందుకోసం మీ సేవా కేంద్రానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ పనిని పూర్తి చేసేయొచ్చు. ఇంట్లోనే ఉండి కొన్ని సింపుల్‌ స్టెప్స్‌ ద్వారా కరెక్షన్స్‌ చేసుకోవవచ్చు. చివరికి స్మార్ట్ ఫోన్‌లోనే సింపుల్‌ స్టెప్స్‌తో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇంతకీ ఆన్‌లైన్‌లో పాన్‌ కార్డులో మార్పులు చేర్పులు ఎలా చేయాలో పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

నివాసితులు కానీ వ్యక్తులు పాన్ కార్డ్ పొందడానికి ఏ పత్రాలు అవసరం?

పాస్‌పోర్ట్ కాపీని పాన్ దరఖాస్తు ఫామ్‌తో పాటు ఏదైనా ఐడీ రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. చిరునామా రుజువుగా కింది పత్రాలలో ఏదైనా తప్పనిసరిగా సమర్పించాలి. 

1) పాస్‌పోర్ట్ కాపీ

2) మీరు నివసిస్తున్న దేశానికి చెందిన బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ కాపీ

3) NRE బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ కాపీ

NRI దరఖాస్తుదారులకు వారి స్వంత భారతీయ చిరునామా లేకపోతే, వారు విదేశాలలో ఉన్న వారి ఇంటి లేదా కార్యాలయ చిరునామాను ఇవ్వవచ్చు. పాన్ కార్డును విదేశాలకు పంపాలంటే, దానితో సహా రుసుము చెల్లించాలి.