జాగ్రత్తగా ఉండండి: పాన్ కార్డ్ పేరుతో ఇలా కూడా మోసం చేస్తున్నారు
పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయమని ఇటీవల కొందరికి మెసేజ్‌లు వస్తున్నాయి. మీకు కూడా అలాంటి మెసేజ్ వస్తే పొరపాటున కూడా క్లిక్ చేయకండి. వాటిని నిజమని నమ్మి వాటిని క్లిక్ చేశారో మీ అకౌంట్స్ ఖాళీ అయిపోతాయి. పాన్ కార్డ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయమని చెప్పే ఫేక్ మెసేజ్‌లు ప్రత్యేకంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) కస్టమర్లను టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. లేదంటే అకౌంట్ బ్లాక్ అవుతుందని బెదిరింపులకు కూడా వారు దిగుతున్నారు. ఈ మెసేజ్‌లలోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
ప్రభుత్వ పత్రికా సమాచార సంస్థ (పీఐబీ) ఈ మెసేజ్‌లు ఫేక్ అని కన్ఫర్మ్ చేసింది. ఇండియా పోస్ట్ అలాంటి మెసేజ్‌లు పంపదని స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి లింక్‌లనూ క్లిక్ చేయవద్దని సూచించింది. వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని కోరింది.
పీఐబీ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. "పాన్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఐపీపీబీ అకౌంట్ 24 గంటల్లో బ్లాక్ అవుతుందనే మెసేజ్ వైరల్ అవుతోంది. ఇది ఫేక్. ఇండియా పోస్ట్ అలాంటి మెసేజ్‌లు పంపదు" అని పోస్ట్‌లో పేర్కొంది. ఇలాంటి ఫిషింగ్ మోసాలకు భయపడవద్దని పీఐబీ కోరింది.
ఏమిటి ఫిషింగ్ మోసం?
ఫిషింగ్ అనేది ఒక రకమైన ఆన్‌లైన్ మోసం. మోసగాళ్ళు బాధితులను నమ్మించి వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. లేదా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయిస్తారు.
రీసెంట్ గా ఏం జరుగుతోందంటే..
పాన్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఐపీపీబీ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ మెసేజ్‌లు నిజమైనవిగా అనిపించవచ్చు. కానీ అవి ఫిషింగ్ మోసంలో భాగమని గుర్తించండి. ఫిషింగ్ ద్వారా సైబర్ నేరస్థులు పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు, అకౌంట్ నంబర్లు వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు.
మరి సురక్షితంగా ఉండటం ఎలా?
సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను పాటించాలని ఐపీపీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పాస్‌వర్డ్‌లను తరచుగా మార్చుకోవాలని సూచించింది. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లను నమ్మవద్దని తెలిపింది. అకౌంట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించింది. పబ్లిక్ వైఫై వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, కొన్నింటిని హ్యాక్ చేసే ఛాన్సస్ ఉంటాయని హెచ్చరించింది. బ్యాంక్ నుంచి వచ్చే సమాచారం నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్‌లో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.