జనవరి నుంచే కొత్త PAN కార్డు: QR కోడ్ ఎందుకు యాడ్ చేస్తున్నారో తెలుసా?
మోడీ సర్కార్ కొత్త PAN 2.0 ని ప్రారంభించింది. ఇది మీ పాత PAN కార్డును కొత్త వెర్షన్ లోకి మారుస్తుంది. QR కోడ్ తో వస్తున్న ఈ పాన్ కార్డ్ వ్యక్తిగత సమాచారం భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకొస్తున్నారు. ఈ అప్‌డేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

మోడీ సర్కార్ కొత్త PAN 2.0 ని ప్రారంభించింది. దీని కోసం రూ.1,435 కోట్లు కేటాయించింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇటీవల వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలలో పాన్ కార్డులను సాధారణ గుర్తింపు పత్రంగా ఉపయోగించాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డుల అప్డేషన్ ప్రారంభించింది.
PAN కార్డ్ అప్‌గ్రేడ్ ఉచితం
PAN కార్డు అప్‌గ్రేడ్ చేసే పనిలో భాగంగా ప్రజల డేటా మిస్ యూజ్ అవుతుందని ఎవరూ భయపడవద్దని కేంద్రం హామీ ఇచ్చింది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని తెలిపింది. ఈ PAN కార్డు అప్‌గ్రేడ్ పూర్తి ఉచితంగా చేయనున్నారు. దీని కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
PAN కార్డులో మార్పులకు కారణం
PAN కార్డులో మార్పులకు ప్రత్యేక కారణం ఉంది. పాన్ కార్డులు మిస్ యూజ్ కాకుండా, ఎవరూ వీటిని కాపీ చేసి మోసపూరిత పనులకు ఉపయోగించకుండా ఉండాలని QR కోడ్ యాడ్ చేస్తున్నారు. QR కోడ్‌తో సహా కొత్త ఫీచర్లతో PAN 2.0 కార్డ్ అందుబాటులో ఉంటుంది. ఈ మెరుగైన పాన్ కార్డ్ ఉచితంగా ఇస్తారు. ఇది కచ్చితంగా ప్రజల అవసరాలను, భద్రతను మెరుగుపరుస్తుందని కేంద్రం నమ్ముతోంది.
QR కోడ్ తో మోసాలకు అడ్డుకట్ట
PAN కార్డుకు QR కోడ్ యాడ్ చేయడం వల్ల అనేక మోసాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. ఎందుకంటే QR కోడ్ సమాచారం ఎన్‌క్రిప్ట్ చేయబడింది. QR కోడ్ ఉండటం వల్ల నకిలీ PAN కార్డులు తయారు చేయడం మోసగాళ్లకు అసాధ్యంగా మారుతుంది. వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడమే లక్ష్యంగా మోడీ సర్కార్ PAN 2.0 ను తీసుకొస్తోంది. దీనివల్ల కార్డు కాపీ చేయడం కష్టం.
పాన్ కార్డు మరింత సెక్యూర్ గా మారిన తర్వాత ప్రతి ప్రభుత్వ వ్యవస్థకు దీన్నే ప్రధాన డాక్యుమెంట్ గా ఆలోచనలో కేంద్రం ఉంది. అంటే ఇకపై ఏ పథకానికి అప్లై చేయాలన్నా అప్‌డేట్ చేసిన PAN 2.0 కార్డు సమర్పించాల్సి రావచ్చు.