Apple ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్న ఫాక్స్‌కాన్ గ్రూప్ భారతదేశంలో 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది. ప్రస్తుతం, ఆపిల్ ఐఫోన్‌తో సహా అనేక ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి వాషింగ్టన్, బీజింగ్‌లో జరుగుతోంది, అయితే ఇప్పుడు ఈ ఉత్పత్తిని పూర్తిగా భారతదేశంలోకి తీసుకురావడానికి ఫాక్స్‌కాన్ సన్నాహాలు చేస్తోంది.

Apple ప్రధాన భాగస్వామి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తమ ఉత్పత్తిని పెంచడానికి భారతదేశంలో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఫాక్స్‌కాన్ ఇప్పటివరకు భారతదేశంలో పెట్టిన అతిపెద్ద పెట్టుబడులలో ఈ పెట్టుబడి ఒకటని వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. 

తైవానీస్ కంపెనీ ఫాక్స్‌కాన్ దాని ఫ్లాగ్‌షిప్ యూనిట్ హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని విమానాశ్రయానికి సమీపంలోని 300 ఎకరాల స్థలంలో ఐఫోన్ విడిభాగాలను తయారు చేయడానికి కంపెనీ ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఫ్యాక్టరీ యాపిల్ హ్యాండ్‌సెట్‌లను కూడా ఇక్కడ అసెంబ్లింగ్ చేయగలదని నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా, ఫాక్స్‌కాన్ తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఇక్కడ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు.

చైనాకు షాక్
భారత్‌లో ఫాక్స్‌కాన్‌ పెట్టుబడులు చైనాకు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, చైనాలో స్థాపించిన కంపెనీలు భారతదేశాన్ని తమ కొత్త గమ్యస్థానంగా మార్చుకోవడం చూస్తున్నాము. ఫాక్స్‌కాన్‌ చేస్తున్న ఈ పెట్టుబడితో, ఎలక్ట్రానిక్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న చైనా తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. రాబోయే కాలంలో భారత్ మరింత లాభపడుతుందని భావిస్తున్నారు.

Scroll to load tweet…

లక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా
ఫాక్స్‌కాన్‌ పెడుతన్న ఈ పెట్టుబడితో భారతదేశంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలను సృష్టించగలదని భావిస్తున్నారు. చైనీస్ నగరమైన జెంగ్‌జౌలో ఉన్న కంపెనీకి చెందిన భారీ ఐఫోన్ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం దాదాపు 200,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హోన్ హై ప్రెసిడెంట్ యంగ్ లియు ఈ వారం భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం విశేషం. 

ఫలితాలను ఇస్తున్న PLI పథకం
మేక్ ఇన్ ఇండియా కింద విదేశీ కంపెనీలను భారత్‌కు తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు ఫలితాలను అందిస్తున్నాయి. వీటిలో PLI పథకం కూడా ఒకటి. భారతదేశంలో ఉపాధి కల్పించడంలో ఈ PLI పథకం విజయవంతమైంది. మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లను తయారు చేసే అమెరికన్ కంపెనీ ఆపిల్ సైతం గత 19 నెలల్లో 1 లక్ష మంది యువతకు ఉపాధి కల్పించింది. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే యాపిల్ గత 19 నెలల్లో భారతదేశంలో దాదాపు లక్ష కొత్త ఉద్యోగాలను ఇచ్చింది. దీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆపిల్ అతిపెద్ద జాబ్ క్రియేటర్‌గా అవతరించింది. యాపిల్ ప్రస్తుతం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) కింద iPhoneలను తయారు చేస్తోంది. 

Foxconn Hon Hai 35 వేల మందికి పైగా యువతకు ఉపాధి కల్పించింది
మోడీ ప్రభుత్వం 2021 ఆగస్టులో PLI పథకాన్ని ప్రకటించింది. ఈ పిఎల్‌ఐ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత Apple ఫోన్ తయారీదారు Foxconn Hon Hai, Pegatron, Wistron కలిసి 60 శాతం కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. వీటిలో ఒక్క తమిళనాడుకు చెందిన ఫాక్స్‌కాన్ హోన్ హై ఒక్కటే 35,500 మంది యువతకు ఉపాధి కల్పించింది. పెగాట్రాన్‌కు తమిళనాడులో యూనిట్ కూడా ఉంది. 14000 మంది యువతకు ఉపాధి లభించింది. కాగా, కర్ణాటక ఆధారిత విస్ట్రాన్‌లో 12800 మంది యువతకు ఉపాధి లభించింది.

యాపిల్ ఫోన్లను తయారు చేసేందుకు పై కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేసిన టాటా ఎలక్ట్రానిక్స్ కూడా ఉద్యోగాలను సృష్టించింది. సాల్‌కాంప్ 11,000 మంది యువతకు ఉపాధి కల్పించింది. ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రకారం, గత 7 సంవత్సరాలలో సుమారు 20 లక్షల మంది యువత ఈ రంగంలో ఉద్యోగాలు పొందారు.

Apple 40 శాతం ఉద్యోగాలను సృష్టించింది.
ఆపిల్ తన ఐఫోన్, లాప్ టాప్ విడి భాగాలు, ఛార్జర్‌ల విభాగంలో 40 శాతం ఉద్యోగాలను సృష్టించింది. డిసెంబర్ 2022లో ఒక నెలలోపు 1 బిలియన్ (సుమారు రూ. 8,267 కోట్లు) డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఐఫోన్‌ను ఎగుమతి చేసిన మొదటి కంపెనీ ఆపిల్ కావడం విశేషం. 2022 ఏప్రిల్-డిసెంబర్ తొమ్మిది నెలల కాలంలో రూ. 30,000 కోట్లకు పైగా ఎగుమతి చేసింది. దేశం నుండి ఎగుమతి చేయబడిన మొత్తం స్మార్ట్‌ఫోన్‌ల విలువలో ఇది దాదాపు 40 శాతం కావడం విశేషం.