Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: భారత్‌లో తగ్గిన కర్బన ఉద్గారాలు.. బట్ నో యూజ్

కరోనా మహమ్మారి ప్రభావంతో భూతాపం తగ్గుముఖం పట్టింది. వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయి ప్రపంచ వ్యాప్తంగా 17 శాతానికి పడిపోయింది. భారతదేశంలో అది 26శాతంగా నమోదు కావడం విశేషం.
 

Study Says World Carbon Pollution Fell 17% at Pandemic Peak
Author
Hyderabad, First Published May 21, 2020, 12:32 PM IST

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటు ఆరోగ్య రంగంతోపాటు ఆర్థిక రంగాన్నీ నిట్టనిలువునా ముంచేసింది. లక్షల మంది ప్రాణాల్ని బలి తీసుకుని వేల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. 

కానీ, కరోనా విజృంభణకు ముందు ప్రపంచాన్ని కలవరపెట్టిన వాతావరణ కాలుష్యం మాత్రం భారీగా తగ్గింది. కరోనా మహమ్మాకి చేసిన మేలేదైనా ఉందంటే ఇదొక్కటనే చెప్పొచ్చు. లాక్‌డౌన్‌తో పాటు వివిధ దేశాల్లో విధించిన కఠిన ఆంక్షల వల్ల ప్రజారవాణా, పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. 

దీంతో కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో తగ్గిపోయాయని బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ‘నేషనల్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం జనవరి-ఏప్రిల్‌ మధ్య ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 17 శాతం మేర పడిపోయాయి. అదే భారత్‌లో ఈ తగ్గుదల 26 శాతంగా నమోదుకావడం గమనార్హం.

ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాల తగ్గుదల 4.4 శాతం నుంచి 8 శాతం వరకు ఉండొచ్చని అంచనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఏడాదిలో కర్బన ఉద్గారాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి.  

బ్రిటన్‌లో 30.7 శాతం, అమెరికాలో 31.6 శాతం, చైనాలో 23.9 శాతం మేర కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు తీవ్ర స్థాయిలో ఉన్న దశలో రోజువారీ ఉద్గారాలు 17 శాతం మేర పడిపోయి 2006 నాటి స్థాయికి చేరాయి.

also read భయపెడుతున్న బంగారం ధరలు.. సరికొత్త రికార్డు స్థాయికి పసిడి ధర...?

రోడ్డు రవాణా వల్ల వెలువడే ఉద్గారాల్లో 43 శాతం తగ్గుదల నమోదైంది. ఇంధన ఉత్పత్తి వల్ల వచ్చే ఉద్గారాల్లో 19 శాతం, పరిశ్రమల కార్యకలాపాల వల్ల వెలువడే ఉద్గారాల్లో 25 శాతం, వివిధ దేశాల మధ్య.. ఆయా దేశాల్లో సాగే విమానయానం వల్ల ఉత్పత్తి అయ్యే ఉద్గారాలు 10 శాతం మేర తగ్గాయి.

అయితే, ఇప్పటికే గణనీయంగా పేరుకుపోయిన ఉద్గారాల వల్ల తాజా తగ్గుదల వాతావరణ మార్పుల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. వాతారణ మార్పులను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రస్తుతం నమోదైన తగ్గుదల ఏమాత్రం సరిపోదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఆర్థిక రంగాన్ని గాడినపెట్టాలన్న లక్ష్యంతో ఉద్గారాల తగ్గింపు విషయంలో రాజీపడకూడదని తాజాగా నిర్వహించిన ఈ అధ్యయనం ఆయా దేశాలకు సూచించింది. కరోనా సంక్షోభం తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగం సహా ఇతర రంగాల పునరుత్తేజానికి రూపొందించే ప్రణాళికల్లో కర్బన ఉద్గారాల తగ్గింపును కూడా చేర్చాలని హితవు పలికింది. 

ముఖ్యంగా రవాణా వల్ల వెలువడుతున్న ఉద్గారాలను కట్టడి చేయడానికి సమగ్ర విధానం ఉండాలని సూచింది. కాలుష్య నివారణకు తాజా పరిస్థితుల్ని అవకాశంగా భావించాలే తప్ప అవరోధంగా కాదని హితవు పలికింది.

Follow Us:
Download App:
  • android
  • ios