ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ పాకిస్థాన్‌లో మాత్రం తగ్గుతున్నాయి. మన ఇండియాలో మాదిరిగానే పాకిస్థాన్ లో కూడా బంగారానికి బాగా డిమాండ్ ఉంది. అయినా కూడా ధరలు మాత్రం పడిపోతున్నాయి. దీనికి కారణాలు ఏంటంటే..
ఈ కాలంలో బంగారం అంటే కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు. నమ్మకమైన, స్థిరమైన ఆదాయ మార్గం కూడా. కాస్త డబ్బులుంటే గ్రాము బంగారం కొని పెట్టుకుంటే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. ఆస్తిగానూ ఉంటుంది.. అవసరాలకు బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఇండియాలో పెరుగుతోంది.. పాకిస్థాన్ లో తగ్గుతోంది..
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా.. అంటే ఎండ, వాన, యుద్ధం జరుగుతున్నా కూడా బంగారం దుకాణం తెరిచి ఉంటే జనం కచ్చితంగా వెళ్తారు. అంతలా బంగారం అందరినీ ఆకర్షిస్తుంది. ఇండియాలో బంగారం ధర 70 వేల రూపాయలు దాటింది. కానీ పాకిస్థాన్‌లో తగ్గింది.
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. అనేక దేశాల మధ్య యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటివి కూడా బంగారం ధరలను మరింత పెంచాయి. అనేక దేశాలు రిస్క్ చేయడం ఇష్టం లేక, స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుందని బంగారంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
పాకిస్థాన్ దేశంలో అన్నీ సమస్యలే..
ఇక పాకిస్థాన్ విషయానికొస్తే ఆర్థిక సమస్యలు, రాజకీయ, సైనిక శక్తుల మధ్య అంతర్గత విభేదాలు, ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. చైనా నుండి అప్పులు కూడా తీసుకుని దేశాన్ని నడిపించే పరిస్థితికి వచ్చింది. అనేక కారణాల వల్ల పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కూడా పడిపోతోంది.
పాకిస్థాన్ లో ధర తగ్గడానికి కారణం ఇదే..
పాకిస్థాన్ లో ఉత్పత్తి తగ్గడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. కూరగాయలు, పండ్లు, గ్యాస్ ధరలు పెరిగాయి. కానీ బంగారం ధర మాత్రం తగ్గింది. ఇండియాలాగే పాకిస్థాన్‌లో కూడా ప్రజలు బంగారం ఇష్టపడతారు. కానీ కొనేవారు లేక అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో ధర తగ్గిపోతోందని నిపుణులు అంటున్నారు.
పాకిస్థాన్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
24K బంగారం పాకిస్థాన్ లో గ్రాము 9135 రూపాయలకు అమ్ముడవుతోంది. ఇండియా కంటే 700 రూపాయలు తక్కువ. ఏ దేశంలోనైనా బంగారం ధర పెరిగినా క్రేజ్ మాత్రం తగ్గదని నిపుణులు అంటున్నారు. ఇండియా, పాకిస్థాన్ ల మధ్య బంగారం ధరల్లో ఎప్పుడూ ఇదే తేడా ఉంటుందని అంటున్నారు.