ముంబై: భారతీయ ఆర్థిక వ్యవస్థను అత్యధిక ముడి చమురు ధరలు తీవ్ర ప్రతికూల ప్రభావం, సమస్యగా పరిణమించాయని చూపుతున్నాయని పలువురు భారత్, విదేశీ పెట్టుబడి దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ ఈ సంగతిని ధ్రువీకరించింది. 100 మందికిపైగా ఆర్థిక సంస్థలకు చెందిన 175 మంది ప్రతినిధుల ఇంటర్వ్యూలతో అమెరికా రేటింగ్ సంస్థ ‘మూడీస్’ ఈ విషయాన్ని నిర్ధారించింది. 

ద్రవ్యలోటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రీ కాపిటలైజేషన్, భారత కార్పొరేట్లకు పరపతి పరిస్థితులు తదితర అంశాలు భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ప్రధానమైనవని మూడీస్ తెలిపింది. 

‘సర్వేలో పాల్గొన్న వారిలో 30.3 శాతం మంది ముడి చమురు ఉత్పత్తులపై అత్యధిక ధరలు ప్రధానమైన రిస్కు అని చెప్పారు. 23.1 శాతం మంది పెరుగుతున్న వడ్డీరేట్లు మరో సమస్యగా పరిణమించిందని అన్నారు. రెండో ప్రధాన సమస్యగా భారతదేశంలో తలెత్తే రాజకీయ సవాళ్లు సమస్యలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారాయని తెలిపారు’ అని మూడీస్ ఉపాధ్యక్షుడు జాయ్ రంఖోథ్గీ చెప్పారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి చేరుకోవడం గగనమేనని మూడీస్ సర్వేలో పాల్గొన్న వారంతా చెప్పారు. 

23.3 శాతం మంది సింగపూర్ ఇన్వెస్టర్లు, 13.6 శాతం మంది ఇన్వెస్టర్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. ముంబైలో 84.7 శాతం మంది, సింగపూర్‌లో 76.7 శాతం మంది పెట్టుబడి దారులు మాత్రం ప్రభుత్వం 3.3 శాతం ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యాన్ని చేరుకోలేదని తేల్చేశారు. 

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రీ క్యాపిటలైజేషన్ ప్రణాళిక ఆయా బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్యను పూర్తిగా పరిష్కరిచలేదని సింగపూర్ లో 85.5 శాతం, ముంబైలో 93.6 శాతం మంది ఇన్వెస్టర్లు తేల్చి చెప్పారు. ముంబైలో ఒక సదస్సుకు హాజరైన కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల్లో 59.6 శాతం మంది బ్యాంకులు మార్కెట్ల నుంచి పెట్టుబడులు సంపాదించలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. 

ముంబైలో 28 శాతం మంది క్యాపిటల్ సేకరణపై క్రెడిట్ ఔట్ లుక్ ప్రభావం చూపుతున్నదని తెలిపారు. సింగపూర్ కు చెందిన 26.9 శాతం మంది భారతీయ ప్రబుత్వం అమలు చేస్తున్న విధానాలు, సంస్కరణలతో క్రెడిట్ ఔట్ లుక్‌ను ప్రభావితం చేస్తోందని మూడీస్ వివరించింది.