ఇటీవల కాలంలో ఒక్కొక్కిరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలుండటం  సాధారణమైపోయింది. ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ సంస్థలు మారే ఉద్యోగుల గురించి చెప్పనవసరం లేదు. సంస్థ మారిన చాలా సందర్భాల్లో కొత్త ఖాతాను ప్రారంభించాల్సి రావడం గమనార్హం. దీంతో చదువుకునే సమయాల్లో ఉండే బ్యాంకు ఖాతా, కంపెనీ మారినప్పుడల్లా మరో ఖాతా ప్రారంభిస్తుండటంతో ఒక్కొక్కరికి ఎక్కువ సంఖ్యలో ఖాతాలు ఉంటున్నాయి.

అయితే, ఇలా ఎక్కువ ఖాతాలుండటం వలన లాభమా? నష్టమా? అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. మన పేరున ఉన్న ప్రతి ఖాతాలో కనీస నగదు నిల్వలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతేగాక, ఏటీఎం, డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు, ఎస్ఎంఎస్ అలర్ట్ రూపంలో రకరకాల ఛార్జీలు బ్యాంకులు వసూలు చేస్తుండటంతో ఆ భారం మనమీదే పడుతుంది. ఈ కారణంగానే ఒకటి కంటే మించి ఖాతాలు అవసరం ఉంటే తప్ప.. వాటిని రద్దు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

జీరో బ్యాలెన్స్ ఆఫర్, లేదా మరో కారణంతోనే సేవింగ్స్ ఖాతా ప్రారంభించే ముందు మనకు అవసరమా? లేదా? అనేది ఆలోచించుకుంటే మంచిది. ఒక్కో అవసరానికి ఒక్కో బ్యాంకు ఖాతాను ప్రారంభించడం వల్ల సులభంా ఉంటుందేమో కానీ, ఖాతాల సంఖ్య పెరిగితే మాత్రం గందరగోళానికి గురవ్వాల్సి ఉంటుంది.

ఒక్కొక్కరికి మూడు బ్యాంకు ఖాతాలకు మించి అవసరం లేదని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. వేతనం కోసం ఒకటి, ఖర్చుల కోసం మరొకటి, పెట్టుబడుల కోసం మరో ఖాతా ఉంటే సరిపోతుందని విశ్లేషిస్తున్నారు. వేతనంతో పాటు డివిడెండ్‌ సైతం ఒకే ఖాతాలో ఉండాలంటున్నారు. 

ఇంటి అవసరాల కోసం చేసే అన్ని ఖర్చులకూ ఒక ఖాతాను ఉపయోగించుకోవాలి. బిల్లుల చెల్లింపులు, గ్రోసరీ కొనుగోళ్లు, ఔషధ కొనుగోళ్లు అన్నీ ఈ ఖాతా నుంచే నిర్వహించాలి. ఇక పూర్తిగా పెట్టుబడులు, పొదుపు నిధుల కోసం మూడో ఖాతాను ఉపయోగించుకోవాలి. క్రమశిక్షణకు కట్టుబడే వారు అయితే రెండు బ్యాంకు ఖాతాలు సరిపోతాయన్నది నిపుణుల అభిప్రాయం. ఒకటి ఆదాయం, పెట్టుబడుల కోసం, రెండో ఖాతా ఖర్చుల కోసం ఉంటే సరిపోతుందని వారంటున్నారు. 

ఎక్కువ ఖాతాలుంటే ఏమవుతుంది?

సేవింగ్స్ ఖాతాలకు కూడా కొన్ని ఛార్జీలు చెల్లించాల్సిందే. ప్రతీ ఖాతాలోనూ నెలవారీ కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించాలి. లేదంటే పెనాల్టీ ఛార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. అలాగే ఖాతాలతోపాటు వచ్చే డెబిట్ కార్డు వార్షిక నిర్వహణ ఛార్జీలు, నెలవారీ ఉంచాల్సిన కనీస బ్యాలెన్స్‌పై రాబడులు కూడా తక్కేవనని పైసాబజార్.కామ్ పేమెంట్ ప్రొడక్ట్స్ హెడ్ సహిల్ అరోరా వివరించారు. 

కనీస బ్యాలెన్స్ 5,000-10,000 వరకు వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఒక వేళ మీకు ఐదు ఖాతాలుంటే 25,000 వరకు నిర్వహించాలి. ఇవి 3-4శాతం రాబడులను మాత్రమే ఇస్తాయి. ఇలా ఎక్కువ ఖాతాల్లో కనీస మొత్తాలను అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో పెట్టుబడిగా పెడితే ప్రయోజనం ఉంటుందని బ్యాంక్ బజార్ చీఫ్ డెవలప్‌మెంట్ అధికారి నవీన్ సూచించారు.

మరొకరితో కలిసి జాయింట్ ఎకౌంట్ తెరిచే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉండి, ఉమ్మడి లక్ష్యాలతో ఉంటే జాయింట్ ఎకౌంట్ మంచి నిర్ణయమని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు దీపాలిసేన్ చెబుతున్నారు. ముఖ్యంగా జీవిత భాగస్వాములు ఉమ్మడి ఖాతాను నిర్వహించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. 

మనం ఏ బ్యాంకు ఖాతా తెరిచినా నామినీని చేర్చడం చాలా ముఖ్యమైన విషయం. కొందరు 10-15ఏళ్ల క్రితం ఖాతాలు తెరిచి మరిచిపోయే వారు కూడా ఉంటారు. అంటే, ఆ బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంటే వారు ఆ మొత్తాన్ని కోల్పోయినట్లే. ఎందుకంటే, బ్యాంకులు వివిధ ఛార్జీల రూపంలో ఆ మొత్తం నుంచి మినహాయించుకుంటూ వస్తాయి.

ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే వారి పేరిట ఐదారు ఖాతాలుంటే.. అన్నింటికీ నామినీ రిజిస్టర్ చేసి లేకపోతే మాత్రం వారు వారి కుటుంబానికి తీరని ఆర్థిక నష్టం చేసిన వారవుతారు. నిపుణులు సూచనల నేపథ్యంలో అధిక సంఖ్యలో ఖాతాలుంటే మూసివేయాలి. అంతేగాక, బ్యాంకు ఖాతా ప్రారంభించే సమయంలో నామినీ పేరుగా భాగస్వామిని లేదా ఇతర కుటుంబసభ్యుల పేరును రిజిష్టర్ చేయాలి. ఖాతాదారు మరణం లాంటి ఘటనలు సంభవిస్తే ఆ ఖాతాలోని మొత్తం నామినీకి చేరే అవకాశం ఉంటుంది.

చదవండి: ‘ఉమాంగ్’లో మీ ‘పాన్’ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం ఎలా?