Airport Jobs: మీరు ఇంటర్మీడియట్ పాసైయ్యారా? ఎయిర్ పోర్ట్‌లో జాబ్ చేయాలనుందా? రూ.30 వేల జీతం ఇచ్చే ఉద్యోగాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. అర్హతలు, దరఖాస్తు వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.

విమానాశ్రయంలో ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకి ఇది నిజంగా శుభవార్త. AAICLAS (AAI Cargo Logistics & Allied Services Company Ltd) కంపెనీలో 396 ఖాళీలు ఉన్నాయట. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉద్యోగాలకు కావాల్సిన చదువు, జీతం, ఖాళీలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం రండి.

ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు, విద్యార్హతలు

ప్రస్తుతం రెండు విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొదటిది సెక్యూరిటీ స్క్రీనర్(Security Screener). దీనికి 230 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్, బోర్డు నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ కి అప్లై చేయడానికి అర్హులు. డిగ్రీలో జనరల్/EWS/OBC వాళ్లైతే కనీసం 60% మార్కులు, SC/ST అభ్యర్థులైతే 55% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ ఫారం నింపేటప్పుడు మాత్రం డిగ్రీ మార్కులను నంబర్స్ లోనే రాయాలి. ఇంగ్లీష్, హిందీ, లోకల్ లాంగ్వేజ్ లో చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

166 అసిస్టెంట్ పోస్టులు ఖాళీ

రెండో ఉద్యోగం అసిస్టెంట్(Assistant Security). దీనికి 166 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా బోర్డు, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి 12 లేదా ఇంటర్ పాసై ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనీసం 60% మార్కులు, SC/ST వాళ్లైతే 55% మార్కులతో 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఆన్ లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 12వ తరగతి మార్కులు కూడా నంబర్స్ లోనే రాయాలి. ఇంగ్లీష్, హిందీ, లోకల్ లాంగ్వేజ్ లో చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

ఎంత జీతం ఇస్తారు.. వయసు ఎంత ఉండాలి

ఈ ఉద్యోగాలకు మంచి జీతం ఇస్తారు. సెక్యూరిటీ స్క్రీనర్ కి మొదటి సంవత్సరం రూ.30,000, రెండో సంవత్సరం రూ.32,000, మూడో సంవత్సరం రూ.34,000 జీతం ఇస్తారు. అసిస్టెంట్ పోస్టుకు అయితే మొదటి సంవత్సరం రూ.21,500, రెండో సంవత్సరం రూ.22,000, మూడో సంవత్సరం రూ.22,500 జీతం ఇస్తారు.

దరఖాస్తు చేసుకునే వాళ్ల వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC వాళ్లకి 3 ఏళ్లు, SC/ST వాళ్లకి 5 ఏళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది.

ఎయిర్ పోర్టులో జాబ్స్ కి ఎలా అప్లై చేయాలంటే..

దరఖాస్తు ఫీజు ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. సెక్యూరిటీ స్క్రీనర్ కి ST/SC/మహిళలు/EWS అభ్యర్థులైతే రూ.100 కట్టాలి. మిగతా వాళ్లు రూ.750/- కట్టాలి. సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుకైతే ST/SC/మహిళలు/EWS వాళ్లు రూ.100, మిగతా వాళ్లు రూ.500 కట్టాలి.

ముందుగా అర్హత ఉన్నవాళ్లని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి

జూన్ 09, 2025 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి సైట్ ఓపెన్ అవుతుంది. చివరి తేదీ జూన్ 30, 2025. అర్హులైన వాళ్లు www.aai.aero వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ లో ఉన్న అర్హతలు మీకు ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి.