Asianet News TeluguAsianet News Telugu

ఏటీఎం సెన్సార్లు గుర్తించకుంటే ఇంతే: ఇదీ కొత్త నోట్ల దుస్థితి

రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా పాత పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలోకి తెస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. పాత నోటతో పోలిస్తే కొత్త నోట్లు అప్పుడే వినియోగానికి అనువుగా లేవని బ్యాంకర్లకు ప్రజలు కొత్త నోట్లను తిరిగి ఇస్తున్నారు. 

Demonetisation: New currency notes issued in 2016
Author
Mumbai, First Published Nov 29, 2018, 1:06 PM IST

రెండేళ్ల క్రితం కేంద్రంగా ఘనంగా ప్రవేశపెట్టిన కొత్త నోట్ల నాణ్యత అప్పుడే దెబ్బ తిన్నది. ఏటీఎం సెన్సార్లు గుర్తించలేకపోతే సదరు నోట్లను బ్యాంకర్లు పక్కన బెట్టేస్తున్నారు. పాత రూ.100, 500, 1000 నోట్లు చూసేందుకే కాదు. వినియోగానికీ మెరుగ్గా ఉండేవి.

తడిచినా, విపరీతంగా నలిగినప్పుడు మినహా, ఇవి దీర్ఘకాలం వినియోగానికి బాగుండేవి. కొత్తగా విడుదల చేసిన రూ.2000, 500 నోట్ల నాణ్యత అప్పుడే దెబ్బతింటోందని, వీటిల్లో ఏటీఎం సెన్సార్లు గుర్తించలేకపోతున్న నోట్లను బ్యాంకులు పక్కన బెడుతున్నాయని ఒక దినపత్రిక తెలిపింది. 

కాగితం నాణ్యత బాగుంటేనే, నోట్లను ఏటీఎం సెన్సార్లు గుర్తిస్తాయని, అందుకు భిన్నంగా ఉన్న వాటిని గుర్తించవని ఆ మీడియా కథనం సారాంశం. ఈ ఏడాది కొత్తగా విడుదల చేసిన రూ.10 నోటు నాణ్యత కూడా సరిగా లేదని పేర్కొంది. పాత రూ.500, 1,000 నోట్లు రద్దు చేశాక అమల్లోకి తెచ్చిన కొత్త నోట్లు, రెండేళ్లలోపే పనికిరాకుండా పోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పాత నోట్లతో పోలిస్తే అధిక భద్రతా ప్రమాణాలు పొందుపరచామని, నకిలీలు చేయడం కష్టమని ప్రభుత్వం కొత్త నోట్ల విడుదల సందర్భంగా తెలిపింది. అయితే నకిలీ నోట్లు కూడా విజృంభిస్తుండగా, అసలు నోట్లు మాత్రం రెండేళ్లలోపే వినియోగం నుంచి వెనక్కి మరల్చాల్సి రావడం అంటే.. నాసిరకంగా తయారు చేయడమే అనే విమర్శలు వస్తున్నాయి.

వినియోగానికి అనువుగా లేకుండా పోయిన నోట్లను బ్యాంకులు పక్కన బెడుతున్నాయని కూడా ఆ దిన పత్రిక తెలిపింది. వీటిని ‘జారీ చేయడానికి అనువుగా లేనివి’గా గుర్తిస్తున్నాయని పేర్కొంది. ఏటీఎం సెన్సార్లు గుర్తించని నోట్లనే బ్యాంకులు ఈ విధంగా పక్కన బెడుతున్నాయని సమాచారం.

ప్రజలు కూడా ముతకగా మారిన నోట్లను బ్యాంకులకు తెచ్చి, కొత్త నోట్లు తీసుకువెళ్తున్నారని పేర్కొంది. మురికిగా మారినవి, మట్టి లేదా ఇంకు వంటి వాటితో ఖరాబయిన వాటిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు బ్యాంకులు పంపుతాయి. వాటిని వినియోగంలో నుంచి తొలగిస్తారు.

నోట్ల కాగితం నాణ్యతపై రాజీ పడుతున్నామన్న ఆరోపణను ప్రభుత్వం ఖండించింది. ‘నోట్లు వినియోగానికి పనికిరాకుండా పోవడానికి కారణాలు ఉన్నాయి. నోట్లను విపరీతంగా మడిచి జాగ్రత్త చేసుకోవడం, చీరకొంగులో, పంచెల్లో వీటిని ముడివేయడం వల్ల ఎక్కువగా నలగడంతో, వినియోగానికి ఇబ్బందులు రావచ్చు’ అని ఆర్థిక శాఖ పరిధిలోని బ్యాంకింగ్‌ డివిజన్‌ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు ఆ దిన పత్రిక తెలిపింది. 

నకిలీలు ముద్రించేందుకు అడ్డుకట్ట వేసే భద్రతా ప్రమాణాలు వీటిల్లో ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. కానీ ఈనాడు ఎక్కువ మంది ప్రజలు చీరల్లో, పంచెల్లో ఇష్టమొచ్చినట్లు మడతలు బెట్టే పరిస్థితి లేదు. మెజారిటీ ప్రజలంతా యువతేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది.  

2015- 16లో నోట్ల ముద్రణకు ఆర్బీఐ రూ.3420 కోట్లు ఖర్చు చేసింది. ఇక 2017 జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు పాత నోట్లు తొలగించి, కొత్తనోట్ల ముద్రణకు ఆర్బీఐ రూ.4912 కోట్లు ఖర్చు చేసింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ.10, 50, 200, 500, 2000 నోట్లను ముద్రించింది. 

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లు పెంపు
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పెంచింది. ఎంపిక చేసిన డిపాజిట్లపై 10 బేసిస్‌ పాయింట్లు వరకు పెంచి 6.80 శాతంగా చేసింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. రూ.కోటి లోపు డిపాజిట్లపై కొత్త రేట్ల పెరుగుదల 5- 10 బేసిస్‌ పాయింట్ల మేర ఉంది. కొత్త రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. 

1- 2 ఏళ్లలో ముగిసే డిపాజిట్లపై వడ్డీ రేట్లను 6.70 శాతం 6.80 శాతానికి పెంచింది. వృద్ధులకు ఈ డిపాజిట్లపై ఇచ్చే రేటు 7.2 శాతం నుంచి 7.30 శాతానికి చేరింది. ఇక 2- 3 ఏళ్ల గడువుతో ముగిసే డిపాజిట్లపై వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి 6.80 శాతానికి పెంచారు. వృద్ధులు 7.30 శాతం వడ్డీ పొందుతారు. ఇతర గడువుల్లో పొందే డిపాజిట్‌లపై ఎటువంటి మార్పులు చేయలేదు. 3- 5 ఏళ్ల డిపాజిట్లపై ప్రస్తుతం ఎస్బీఐ 6.80 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios