Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చేమటలు పట్టిస్తున్న కరోనా వైరస్...కారణం ?

కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఆర్థిక వ్యవస్థపై  2 లక్షల కోట్ల డాలర్ల మేర ప్రభావం పడుతుందని, గ్లోబల్‌ జీడీపీ 2.5%దిగువనే నమోదవుతుందని ఐక్యరాజ్య సమితి నిపుణుల అంచనా వేసింది. 
 

Coronavirus crisis could cost world up to $2 trillion: UN
Author
Hyderabad, First Published Mar 11, 2020, 11:10 AM IST

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుస్తీ చేసింది. కరోనా వైరస్‌ బారినపడ్డ గ్లోబల్‌ ఎకానమీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నది. అగ్రదేశాలకు సైతం ఈ మహమ్మారి ముచ్చెమటలు పట్టిస్తున్నది. దీని దెబ్బకు ప్రపంచ వార్షిక జీడీపీ అంచనాలు 2.5 శాతం దిగువకు పడిపోయాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది రూ.148 లక్షల కోట్ల (2 ట్రిలియన్‌ డాలర్లు) వరకు నష్టం వాటిల్లవచ్చని ఐక్యరాజ్య సమితి (ఐరాస‌) నిపుణులు అంచనా వేశారు. ‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2 శాతం మందగమనాన్ని మనం చూస్తామనిపిస్తున్నది’ అని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగంలో ప్రపంచీకరణ, అభివృద్ధి వ్యూహాల శాఖ డైరెక్టర్‌ రిచర్డ్‌ కోజుల్‌-రైట్‌ అన్నారు. 

ఇప్పటిదాకా కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 4వేల మందికిపైగా చనిపోగా, ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య 3వేలు దాటింది. ఇక 100కి పైగా దేశాల్లో సుమారు 1.15 లక్షల మంది బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాణాంతక వైరస్‌.. మనుషుల ప్రాణాల్నేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ మింగేస్తున్నదని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగంలో ప్రపంచీకరణ, అభివృద్ధి వ్యూహాల శాఖ వ్యాఖ్యానించింది.

also read కరోనానా మజాకా... 50% పెరిగిన డ్రగ్స్‌ ధరలు...

ఈ క్రమంలోనే కనిష్ఠంగా 1 ట్రిలియన్‌ డాలర్లు.. గరిష్ఠంగా 2 ట్రిలియన్‌ డాలర్ల మేర ప్రపంచ ఆదాయం క్షీణించవచ్చని తెలిపింది. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌.. ప్రపంచ దేశాలకూ పాకుతుండటంతో ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి.

ఈ అంటువ్యాధిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు వ్యాపార, పారిశ్రామిక రంగాలకు విఘాతం కలిగిస్తున్నాయి. వైరస్‌ భయాలతో కార్మికులు ఇండ్లకే పరిమితమవుతుండటంతో కర్మాగారాలు మూతబడి ఉత్పత్తి నిలిచిపోతున్నది. రోడ్ల మీదకూ వచ్చేందుకు జనాలు బెంబేలెత్తిపోతుండటంతో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. 

చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్ర స్థాయిలో నష్టపోగా, ఇటలీ, దక్షిణ కొరియా తదితర దేశాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే చైనాయేతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆదాయం 220 బిలియన్‌ డాలర్లు పడిపోవచ్చంటునని యూఎన్‌ ఏజెన్సీ హెచ్చరించింది.

భారత ఆర్థిక వ్యవస్థకు 348 మిలియన్‌ డాలర్ల (రూ.2,569 కోట్లు) నష్టం రావచ్చని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగంలో ప్రపంచీకరణ, అభివృద్ధి వ్యూహాల శాఖ అంచనా వేస్తున్నది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ కరోనా కుదిపేస్తుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనానికి సూచికేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కెనడా, మెక్సికో, సెంట్రల్‌ అమెరికన్‌ రీజియన్‌, తూర్పు, దక్షిణాసియా దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు కరోనాతో ప్రభావితం అవుతున్నట్లు చెప్తున్నారు. ఈ దేశాల్లో 0.7 నుంచి 0.9 శాతం మేర వృద్ధిరేటు పడిపోయే వీలుందన్నారు. 

మరోవైపు చమురు ఎగుమతి దేశాలను కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ ముడి చమురు వినియోగం భారీగా తగ్గిపోయింది. ప్రపంచ ముడి చమురు వినియోగదారుల్లో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి విదితమే.

ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోయి క్రూడ్‌ ధరలు విపరీతంగా దిగజారాయి. సోమవారం బ్యారెల్‌ ముడి చమురు ధర 30 డాలర్ల దగ్గర్లో కదలాడినది తెలిసిందే. మొత్తానికి ఏ ఉత్పత్తి తయారుచేసినా ప్రపంచం మీదికి వదిలే చైనా.. తమ దేశంలో పుట్టిన కరోనా వైరస్‌నూ ఇతర దేశాలకు అంటించింది. దీంతో ఇప్పుడు అన్ని దేశాలూ లబోదిబోమంటున్నాయి.

also read చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు...సరికొత్త రికార్డు స్థాయికి పసిడి...

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌ అప్రమత్తమైంది. సిలికాన్‌ వ్యాలీ, శాన్‌‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌ లలోని తమ కార్యాలయాలకు వచ్చే సందర్శకులను కట్టడి చేస్తున్నది. 

ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని ఇచ్చిన గూగుల్‌.. ఉద్యోగార్థులకూ ఇంటర్వ్యూలను ఆపేస్తున్నది. తమ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి సమావేశాలనూ రద్దు చేసుకుంటున్నది. ఆపిల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలూ తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఈ వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని టెక్ దిగ్గజం ఆపిల్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ట్విట్టర్‌ సోమవారం నుంచే ఉద్యోగులకు ఇంటి పని సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios