Asianet News TeluguAsianet News Telugu

చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు...సరికొత్త రికార్డు స్థాయికి పసిడి...

కరోనా వైరస్ భయం ఒకవైపు.. మరోవైపు ఆర్థిక మాంద్యం సంకేతాలతోపాటు ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా పసిడి కనిపిస్తోంది. అందుకే స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తుండగా, పసిడి ధరలు మాత్రం పైపైకి ఎగసి పడుతున్నాయి. ఇలాగే పరిస్థితులు కొనసాగితే మాత్రం అక్షయ తృతీయ నాటికి తులం బంగారం రూ.50 వేలకు చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

Gold retreats to Rs 44,014 per 10 gm, likely to touch Rs 50,000 by Akshaya Tritiya
Author
Hyderabad, First Published Mar 11, 2020, 10:27 AM IST

ముంబై: స్టాక్‌ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. పసిడి ధర కొండెక్కుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సోమవారం రూ.45,000 స్థాయిని దాటేసింది. ముంబైలో తులం పసిడి రూ.44,014 పలికింది.

ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందూ ధరలు అప్‌ట్రెండ్‌లోనే పయనించవచ్చని ముంబై జువెలర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. ఉగాదికి లేదంటే వచ్చేనెల 26వ తేదీన అక్షయ తృతీయ నాటికి బంగారం ధర  రూ.50వేలకు చేరుకోవచ్చని కుమార్ జైన్‌ అంచనా వేశారు.

also read కరోనా ఎఫెక్ట్‌ : గూగుల్‌ ఉద్యోగులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు..!

కరోనా వైరస్ భయాలకు ముడి చమురు ధరల పతనం కూడా తోడవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకోనుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. దాంతో బంగారం, వెండి ధరలు వేగంగా ఎగబాకుతున్నాయి. 

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఏడేళ్ల గరిష్ఠ స్థాయి 1,700 డాలర్లకు ఎగబాకింది. మంగళవారం మళ్లీ కాస్త తగ్గి 1,670 డాలర్లకు జారింది. కరోనా వైరస్‌ ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. పైగా సౌదీ అరేబియా, రష్యా మధ్య మొదలైన ధరల యుద్ధంతో ముడి చమురు ధరలు 20 డాలర్ల వరకు పడిపోవచ్చన్న అంచనాలున్నాయి. 

దీంతో ప్రపంచ మార్కెట్లో సంక్షోభం మరింత తీవ్రతరం కావచ్చని, తత్ఫలితంగా పసిడికి డిమాండ్‌ పెరగవచ్చని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఔన్సు బంగారం ధర 1,700 డాలర్లకు కాస్త అటూ ఇటూగానే ట్రేడ్‌కావచ్చని, స్వల్పకాలంలో 1,780 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో 1,900 డాలర్ల ఎగువకు చేరుకునే అవకాశాలున్నాయని వారంటున్నారు.

also read ముకేశ్ అంబానీ బీట్ చేసిన అలీబాబా అధినేత...ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జాక్ మా

అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఔన్స్ పసిడి ధర 1690 డాలర్లను దాటింది. తొలిసారి ఈ నెల తొమ్మిదో తేదీన 1700 డాలర్లను అధిగమించేసిందని యాక్సిస్ సెక్యూరిటీస్ కమొడిటీస్ అండ్ కరెన్సీ అధిపతి సునీల్ కుమార్ కాట్కే తెలిపారు. 2012 తర్వాత ఔన్స్ బంగారం ధర 1700 డాలర్లను దాటడం ఇదే తొలిసారి అని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ నవ్ నీత్ దమానీ పేర్కొన్నారు. 

దేశీయంగా పసిడి ధర రూ.44,100-రూ.44,700 మధ్య తచ్చాడుతుందని, అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1655 నుంచి 1690 డాలర్లను తాకుతుందని అంచనా. ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర ఇంట్రా డేలో రూ.44,772 నుంచి రూ.43,851 మధ్య తచ్చాడుతుందని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios