హైదరాబాద్: చైనా నుంచి ఇంటర్మీడియెట్స్‌ను దిగుమతి చేసుకుని బల్క్‌డ్రగ్స్‌ను తయారు చేసే కొన్ని యూనిట్లకు ముడిపదార్థాల కొరత ప్రారంభమైంది. కరోనా వైరస్‌ వల్ల చైనా నుంచి ఇంటర్మీడియెట్స్‌, బల్క్‌ డ్రగ్స్‌ సరఫరా నిలిచిపోయింది. 

మెడిసిన్స్ ఇంటర్మీడియెట్స్‌ నిల్వలు ఈ నెలాఖరు వరకూ వచ్చే అవకాశం ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బల్క్‌ డ్రగ్స్‌ తయారీకి అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఔషధ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఫార్ములేషన్లు తయారు చేసే ఖాతాదారుల నుంచి బల్క్‌ డ్రగ్స్‌కు ఆర్డర్లు లభిస్తే.. గతంలో వారంలో సరఫరా చేయగలిగితే, ఇప్పుడు నెలకు పైగా సమయం కోరుతున్నారు. ముడి పదార్ధాల సరఫరాలో అంతరాయం వల్ల జనవరి చివరి నుంచి పారాసిటమాల్‌ ఒక కేజీ ధర రూ.300 నుంచి రూ.600 దాటింది. దాదాపు 500 పైగా బల్క్‌డ్రగ్స్‌ను ఔషధ పరిశ్రమ తయారు చేస్తోంది. 

also read చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు...సరికొత్త రికార్డు స్థాయికి పసిడి...

ఇంటర్మీడియెట్స్‌ లభ్యతలో జాప్యం వల్ల దాదాపు గత రెండు నెలల కాలంలో బల్క్‌ డ్రగ్స్‌ ధరలు కనీసం 50 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. దీని ప్రభావం ఫార్ములేషన్ల తయారీ యూనిట్లపై కూడా ఉంటుంది. వచ్చే 15-20 రోజుల్లో సరఫరా అంతరాయాలు తొలగిపోవచ్చని ఔషధ పరిశ్రమ భావిస్తోంది. 

పరిస్థితుల్లో మార్పు రాకపోతే మాత్రం ఏపీఐ ధరలు మరింత పెరగడానికి అవకాశం ఉందని ఔషధ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతానికి పర్వాలేదని.. కొనసాగితే ఇబ్బంది తప్పదని ఆ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

మరోవైపు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని ఔషధ కంపెనీల వద్ద ఉన్న ఇంటర్మీడియెట్స్‌, బల్క్‌డ్రగ్‌ నిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఏపీఐల కొరత, లభ్యతలపై నివేదికలు కోరాయి. 

ప్రతి ఏడాది భారత్‌ 350 కోట్ల డాలర్ల (దాదాపు రూ.25,550 కోట్లు) విలువైన రసాయనాలు, ఇంటర్మీడియెట్స్‌, ఏపీఐలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో దాదాపు 70 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి.

కొన్ని యూనిట్లు చైనా నుంచి ఇంటర్మీడియెట్స్‌ను దిగుమతి చేసుకుని బల్క్‌డ్రగ్స్‌ను తయారు చేసి ఎగుమతి చేస్తాయి. చైనా కంపెనీలు తక్కువ ధరకు సరఫరా చేయడం వల్ల అధికశాతం కంపెనీలు ఏపీఐలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.

కరోనా ప్రభావం కొనసాగితే  ఫెర్మెంటేషన్‌ ద్వారా తయారు చేసే కొన్ని రకాల యాంటీ బయాటిక్స్‌కు కొరత ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. చైనాలో కరోనా వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా ఇంటర్మీడియెట్స్‌, ఏపీఐలు తయారవుతున్నాయి. అయితే.. రవాణా నిలిచిపోవడం వల్లే సరఫరాకు అంతరాయం జరుగుతోందని.. ఈ పరిస్థితి మారిపోగలదని ఔషధ కంపెనీ అధిపతి ఒకరు తెలిపారు. 

also read రాణా కపూర్ కూతురుకి షాక్... విమానం ఎక్కుతున్న ఆమెను...

దీనికి తోడు కరోనా వైరస్ నేపథ్యంలో దేశీయంగా కొరత రాకుండా చూసేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్టీ) 26 రకాల ఏపీఐలు, వాటితో తయారు చేసే ఔషధాల ఎగుమతులపై నిషేధం విధించింది. వీటిలో పారాసిటమోల్‌, బీ1, బీ12 విటమిన్లు తదితరాలు ఉన్నాయి. ఎగుమతులపై నిషేధం విధించడంతో భారత్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్న ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. 

యూరోపియన్ యూనియన్ దేశాలు ఫార్ములేషన్లను భారత్‌ నుంచి బాగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఐరోపా దేశాల్లో విక్రయించే జనరిక్‌ ఫార్ములేషన్ల మార్కెట్‌లో దాదాపు 25 శాతం వాటా భారత్‌ కంపెనీలదే. భారత ఔషధ ఎగుమతుల్లో నిషేధం విధించిన ఔషధాల వాటా 10 శాతం వరకూ ఉంటుందని అంచనా.

అమెరికా జనరిక్‌ ఫార్ములేషన్ల మార్కెట్‌లో కూడా భారత కంపెనీలకు ఇదే స్థాయి వాటా ఉంది. భారత్‌ దాదాపు 200 దేశాలకు ఔషధాలను ఎగుమతి చేస్తోంది. ఎగుమతులపై నిషేధం కారణంగా భారత ఔషధ కంపెనీలకు ఆదాయపరంగానూ, రెప్యుటేషన్‌ పరంగానూ నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.