ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌) కుప్పకూలకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్వహణ మూలధన అవసరాల కోసం రూ.4,500 కోట్ల సేకరించేందుకు మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌ దిగ్గజం రైట్స్‌ ఇష్యూ జారీ చేసింది. ఈ నెల ఐదో తేదీ నుంచి 19 వరకు కొనసాగిన రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధుల సేకరణలో ఘోరంగా విఫలమైంది. దాంతో ఈ ప్రక్రియను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం తక్షణ అవసరాలకు ప్రభుత్వాన్ని నిధులు సమకూర్చాలని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ బోర్డు కోరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2008 ఆర్థిక మాంద్యానికి కారణమైన లేమన్‌ బ్రదర్స్‌ సంక్షోభ సమయంలోనూ అమెరికా ప్రభుత్వం ఇదే తరహా చర్యలు చేపట్టాల్సి వచ్చింది.
 
బకాయిల చెల్లింపుల్లో వరుసగా విఫలమవుతూ మార్కెట్‌ వర్గాలను కలవర పెట్టిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూపు యాజమాన్యాన్ని ఈనెల 1న కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. పాత బోర్డును రద్దు చేసి కొటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్  ఉదయ్‌ కోటక్‌ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఒకవేళ సంస్థకు బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ ప్రకటించాల్సి వస్తే ప్రభుత్వం రెండోసారి కలుగజేసుకున్నట్లవుతుంది.

కంపెనీ మూలధన నిధుల అవసరాలు తీరేందుకు ప్రభుత్వ ఉద్దీపనతోపాటు ఇతర ప్రత్యామ్నాయాలూ ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం బెయిల్‌ అవుట్‌ ఇవ్వడం సాధ్యపడపకపోతే.. మార్కెట్‌ నుంచి భారీ మొత్తంలో రుణం సేకరించేందుకూ అవకాశం ఉందన్నారు. సంస్థకు ప్రభుత్వం అండగా ఉంది గనుక రుణదాతలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్ సంస్థకు రూ.16,000 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. ఉద్దీపన ప్యాకేజీకి బదులుగా ప్రభుత్వం బకాయిపడిన దాంట్లో కొంత మొత్తాన్ని చెల్లించే అవకాశాలూ లేకపోలేదు.
 
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ పునరుద్ధరణకు గ్రూపు ఆస్తుల విక్రయంపై కొత్త బోర్డు దృష్టిసారించింది. పునరుద్ధరణ ప్రణాళిక ఖరారు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇందులో భాగంగా పునరుద్ధరించాల్సిన, దిలించుకోవాల్సిన అనుబంధ కంపెనీల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక సేవలు, ఎనర్జీ విభాగాలను విక్రయించే అవకాశం ఉంది. ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ విషయంలో మాత్రం కొంత వాటాను విక్రయించడం గానీ, కొన్ని రోడ్డు ప్రాజెక్టులను ప్రైవేట్‌ సంస్థలకు విక్రయించడం గానీ జరగవచ్చు.
 
సంక్షోభ పరిష్కార ప్రణాళికను రూపొందించి, అమలు చేసేందుకు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ బోర్డు ముగ్గురు సలహాదారులను నియమించుకున్నది. ఆర్ప్‌వుడ్‌ క్యాపిటల్‌, జేఎం ఫైనాన్షియల్‌ను ఫైనాన్షియల్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్లుగా, ఆల్వరెజ్‌ అండ్‌ మర్సల్‌ (ఏ అండ్‌ ఎం)ను గ్రూపు పునర్వ్యవస్థీకరణ సలహాదారుగా నియమించుకున్నట్లు సోమవారం ప్రకటించింది. సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ఐఎల్ఎఫ్ఎస్ బోర్డుకు ఈ మూడు సంస్థలు సలహాలు ఇవ్వనున్నాయి. ఆర్ప్‌వుడ్‌, జేఎం ఫైనాన్షియల్‌లు గ్రూపు ఆస్తుల విలువను లెక్కగట్టడం, వాటిని విక్రయించడం చేపట్టనున్నాయి. ఇక గ్రూపు పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను ఏ అండ్‌ ఎం చేపట్టనుంది.
 
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, దాని అనుబంధ విభాగాలు ఈమధ్యకాలంలో బకాయిల తిరిగి చెల్లింపుల్లో వరుసగా విఫలమవుతూ వచ్చాయి. దాంతో మార్కెట్లో ద్రవ్య కొరత ఆందోళనలు మొదలయ్యాయి. పీకల్లోతు కష్టాల్లోకి కూరుకున్న ఈ సంస్థ వల్ల ఆర్థిక సేవల మార్కెట్‌ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొత్తం 348 అనుబంధ విభాగాలు కలిగిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూపు రుణ భారం ఈ ఏడాది మార్చి చివరినాటికి రూ.91వేల కోట్లకు చేరుకున్నది.