న్యూఢిల్లీ/లండన్: భారత్ భవిష్యత్ పాలిట ముడి చమురు కీలకంగా మారింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో భారత్ సహా ప్రపంచ మార్కెట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే ఎదురయ్యే పరిణామాల గురించి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు అందర్నీ భయపెడుతున్న అంశం.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులతో పశ్చిమాసియా నుంచి ముడి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా ఇరాన్, ఇరాక్లో చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడవచ్చు. పైగా అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. హార్మూజ్ జలసంధి నుంచి చమురు ఎగుమతులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించవచ్చన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. 

also read దిగోచ్చిన బంగారం ధరలు... ప్రస్తుత ధరెంతంటే.....?

ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా చేయడానికి అత్యంత కీలక జలమార్గాల్లో ఇదొకటి. ప్రపంచ ముడి చమురు ఎగుమతుల్లో 20 శాతం ఈ జలసంధి నుంచే సరఫరా అవుతాయి. 2018లో ఈ జలమార్గం గుండా రోజుకు 2.1 కోట్ల పీపాల చమురు సరఫరా జరిగింది. యుద్ధ భయాలతో చమురు ధర ఇప్పటికే 70 డాలర్లకు చేరువైంది. 

హార్మూజ్ జలసంధి నుంచి ఎగుమతులకు ఆటంకమేర్పడితే రేట్లు అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నది. దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. 

ఇప్పటికే దేశీయ ఇంధన దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతోంది. పైగా, ఆర్థిక మందగమనంలోకి జారుకున్న తరుణంలో ముడి చమురు ధర అనూహ్యంగా పెరగడమంటే మూలిగే నక్కపై తాటి పండు పడినట్లేనని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముడి చమురు, బంగారం ధరలు అనూహ్యంగా పెరగవచ్చునని అదే జరిగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం పడుతున్నది. 

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలూ పెరుగుతాయి. రవాణా వ్యయం పెరిగి ఇతర వస్తువులు, ఉత్పత్తులు మరింత ప్రియమవుతాయి. ధరలను అదుపు చేసేందుకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే.. అంతంత మాత్రంగా ఉన్న రుణ వృద్ధి మళ్లీ క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ పరిణామం ప్రైవేట్ పెట్టుబడులు, వినియోగం, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపితే, తత్ఫలితంగా వృద్ధి పునరుద్ధరణ మరింత జాప్యమవుతుందన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. దిగుమతుల భారం పెరిగి ద్రవ్యలోటు కరెంట్ ఖాతా లోటు నియంత్రణ లక్ష్యాలు గురితప్పుతాయని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇరాన్-ఒమన్ మధ్యనున్న హార్మూజ్ జలసంధి గుండా ముడిచమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయిన పక్షంలో ఇంధన డిమాండ్ అమాంతం పెరుగుతుందని కమోడిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో బ్యారెల్ ధర 100 డాలర్లకు ఎగబాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రైబెకా ఇన్వెస్ట్‌మెంట్ పార్టనర్స్‍కు చెందిన అనలిస్టు జేమ్స్ ఎగింటన్ తెలిపారు. 

దీర్ఘకాలంపాటు ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగితే కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు, లాభాలపైనా ప్రభావం చూపనున్నది. ఇంధన విక్రయ సంస్థలు, వాహన తయారీ, రసాయనాలు, పెయింట్లు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్స్తోపాటు కొన్ని ఎఫ్ఎంసీజీ రంగంలోనూ కొన్ని కంపెనీల ఆదాయాలకు గండి పడే అవకాశం ఉంది.

also read ‘2022 నాటికి దేశంలో అందరికీ సొంతిల్లు’....నిరంజన్ హీరా
 
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత కారణంగా ముడి చమురు ధరలు ఎగబాకుతున్న నేపథ్యంలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతదేశానికి ఎలాంటి సంక్షోభ ముప్పు లేదని, ఈ పరిణామానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
 
ముడి చమురు ఉత్పత్తిలో మూడోవంతు పశ్చిమాసియా దేశాలదే కావడం గమనార్హం. 84% దేశీయ ఇంధన అవసరాల్లో దిగుమతుల వాటాగా ఉంటే, సహజ వాయువు దిగుమతుల వాటా 40%గా ఉంది. భారతదేశ ఇంధన అవసరాలను మూడింట రెండొంతులు పశ్చిమాసియా దేశాలు సమకూరుస్తున్నాయి. 

పశ్చిమాసియా దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాక్‌ అధికంగా భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు 20.73 కోట్ల టన్నులుగా ఉంది. ముడి చమురు కోసం భారతదేశం గత ఆర్థిక సంవత్సరంలో 11,190 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ఇందులో ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న చమురు కోసం 1,352 కోట్ల డాలర్లుగా ఉంది.