సాధారణంగా మనకు అప్పుడప్పుడు కళ్లు అదురుతుంటాయి. కొందరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ మరికొందరు కళ్లు అదరడం వల్ల శుభ, అశుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కన్ను అదరడం గురించి ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.
అప్పుడప్పుడు కళ్లు అదరడం సహజం. కానీ అదే పనిగా కన్ను అదురుతూ ఉంటే. శుభ లేదా అశుభ వార్త వినాల్సి వస్తుందని చెబుతుంటారు పెద్దలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కన్ను అదరడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. స్త్రీలకు కుడి, ఎడమ కన్ను అదరడం వల్ల వేరు వేరు ఫలితాలు ఉంటాయి. ఇంతకీ ఏ కన్ను అదిరితే మంచిది? ఏ కన్ను అదిరితే చెడు జరుగుతుంది? కళ్లు అదే పనిగా అదిరినప్పుడు ఏం చేయాలి? ఇతర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఏమవుతుంది?
చాలామందికి అప్పుడప్పుడు ఎడమ కన్ను అదురుతుంటుంది. అయితే స్త్రీలకు ఎడమ కన్ను పదే పదే అదరుతుంటే శుభం జరుగుతుందని అర్థమట. త్వరలో వారు శుభవార్తలు వినే అవకాశం ఉంటుందట. స్త్రీల ఎడమ కన్ను అదరటం.. వారి జీవితంలో అదృష్టం కలిసివస్తుందని చెప్పే శుభ సూచన అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
స్త్రీలకు కుడి కన్ను అదిరితే ఏమవుతుంది?
చాలామంది పెద్దలు స్త్రీలకు కుడి కన్ను అదిరితే అశుభం జరుగుతుందని చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా మహిళలకు కుడి కన్ను అదరడం అస్సలు మంచిది కాదట. దానివల్ల ఏదో అశుభ వార్త వారికోసం ఎదురుచూస్తోందని అర్థమట. కుడి కన్ను అదిరినప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్త్రీలకు కుడి కన్ను అదిరినప్పుడు ఇంట్లో చెడు జరగడం లేదా వారు బాధపడే విషయాలు ఎదురవడం వంటివి జరుగుతాయట.
రెండు కళ్లు ఒకేసారి అదిరితే ఏమవుతుంది?
కొన్నిసార్లు రెండు కళ్లు ఒకేసారి అదురుతుంటాయి. అలా అదిరినప్పుడు దానికి అర్థం తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అయితే స్త్రీలకు రెండు కళ్లు ఒకేసారి అదిరితే పాత లేదా దూరమైన మిత్రులను కలుసుకుంటారట.
కళ్లు పదే పదే అదిరితే ఏం చేయాలి?
జ్యోతిష్య నిపుణుల ప్రకారం కళ్లు పదే పదే అదరుతుంటే లక్ష్మీదేవికి నెయ్యితో దీపం వెలిగించి.. పాయసంతో నైవేద్యం పెట్టాలి. కుడి కన్ను అదరితే గంగాజలం వేసుకొని.. హనుమాన్ చాలీసా చదవితే చెడు జరగదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది .