గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు కాపురం చేసిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధపడ్డారని ధ్వజమెత్తారు. 

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల టీఆర్ఎస్ తో పొత్తుకోసం హరికృష్ణ మృతదేహం సాక్షిగా అర్రులు చాచలేదా అంటూ నిలదీశారు. మృతదేహం పక్కనే ఉందని తెలిసి కూడా సిగ్గు లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పొత్తుకు ప్రయత్నించింది చంద్రబాబు కాదా అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. 

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది వాస్తవం కాదా అని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిన ఏకైక సీఎం చంద్రబాబు అంటూ విమర్శించారు. 

ఓటుకు నోటు కేసుకు భయపడే హైదరాబాద్‌ నుంచి పారిపోయి అమరావతికి వచ్చేశారని స్పష్టం చేశారు. ఆ రోజు నుంచి 3 నెలల క్రితం వరకు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడని షర్మిల చెప్పుకొచ్చారు. 

శవ రాజకీయాలు చేసిన చంద్రబాబు తమను విమర్శించడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తు లేదన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ బంపర్ మెజారిటీతో గెలవబోతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.  

రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తండ్రి లాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్‌ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి బాబు అంటూ ధ్వజమెత్తారు. 

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని పక్కన పడేసిన చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కావాలంటే అంతా ఆలోచించి వైసీపీకి ఓటేయ్యాలని వైఎస్ షర్మిల కోరారు.  

ఈ వార్తలు కూడా చదవండి

పప్పు అంటూ అఆలు రావంటూ నారా లోకేష్ పై వైఎస్ షర్మిల వ్యాఖ్యలు

వైఎస్ మాటను గుర్తు చేసి చంద్రబాబుపై విరుచుకుపడ్డ షర్మిల