గుంటూరు : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు నిజం చెబుతారో అప్పుడు ఆయన తల వేయి ముక్కలవుతుందని అందుకే ఆయన ఎప్పుడూ నిజం చెప్పరని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. అమ్మకు అన్నం పెట్టడు గానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా చంద్రబాబు పాలన ఉందని ఆమె ధ్వజమెత్తారు. 

గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మహమ్మద్ ముస్తఫా, ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిల తరపున ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వారిని గెలిపించాలని కోరారు. 

గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చారని దాంట్లో ఒక్కటైనా నెరవేర్చారా అంటూ నిలదీశారు. ప్రతీ ఒక్కరూ చంద్రబాబును నిలదియ్యాలని సూచించారు.  మహాలక్ష్మి పథకం  ఏమైందో నిలదీయాలని కోరారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారా. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించిన విషయం వాస్తవం కాదా అంటూ విరుచుకుపడ్డారు. 

ఐదేళ్లలో నెలకు రూ.2 వేల చొప్పున రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారని చెప్పారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అంటూ వాగ్ధానాలు చేశారని అవి ఎక్కడైనా నెరవేరాయా అంటూ నిలదీశారు. 

చేనేత కార్మికులకు పూర్తి రుణమాఫీ అన్నారు కానీ ఎక్కడైనా చేశారా అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ నిధులు ఇవ్వాలని నిలదీయ్యండి అంటూ సూచించారు. 

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక చేనేత కార్మికులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. మగ్గమున్న ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు ఇస్తామని అలాగే 45 ఏళ్లు నిండిన చేనేతన్నలకు ఇంటికి ఇద్దరి చొప్పున రూ.2 వేల పెన్షన్‌ ఇస్తామని ప్రకటించారు.  
 
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి హోదా కోరుతూ ఢిల్లీలో దీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అనేకమార్లు నిరాహార దీక్షలు చేశారని, అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారని స్పష్టం చేశారు. 

అంతేకాదు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారని గుర్తు చేశారు. హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న చంద్రబాబు యూటర్న్‌ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏనాడు నిజం చెప్పరని షర్మిల స్పష్టం చేశారు. 

చంద్రబాబు గురించి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కమాట చెప్తూ ఉండేవారని అందేంటే ఎప్పుడైతే చంద్రబాబు నిజం చెబుతారో అప్పుడు ఆయన తల వేయి ముక్కలవుతుందట. అందుకే ఆయన ఎప్పుడూ అబద్దాలే చెప్తారని నిజం ఏనాడు చెప్పరంటూ చెప్పేవారని అది నిజమేనని చంద్రబాబు అబద్దపు వాగ్ధానాలు చూస్తుంటే తెలుస్తోందని వైఎస్ షర్మిల అన్నారు.