అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోరిక నెరవేరలేదట. దేవుడుని ప్రార్థించినా కూడా కరుణించలేదని తెగ బాధపడిపోతున్నారు. అదేంటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వైయస్ జగన్ సీఎం కాబోతున్నారు ఇంకేమి కోరిక నెరవేరలేదు అనే కదా మీ డౌట్. 

నిజమే ఆయన కోరిక నెరవేరలేదని సాక్షాత్తు మీడియా ముందు మెుత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ప్రత్యేక హోదా సాధించి తీరతానని హామీ ఇచ్చారు. 25 మంది ఎంపీలను అప్పగిస్తే కేంద్రంలో చక్రం తిప్పి మన హక్కును సాధించుకుంటామని చెప్పుకొచ్చారు. 

తన హామీ నెరవేరాలంటే కేంద్రంలో ఎన్డీఏకు 250 సీట్లకు మించి రావొద్దని ఎన్నోసార్లు దేవుడి ప్రార్థించినట్లు జగన్ చెప్పుకొచ్చారు. 250 సీట్లు కంటే తక్కువ వస్తే ఢిల్లీ వచ్చి ప్రత్యేక హోదా తీర్మానంపై సంతకం పెట్టించుకుని మరీ వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. 

అయితే మన ఖర్మ అలా జరగలేదన్నారు. ఎవరి మద్దతు అవసరం లేకుండానే బీజేపీ ఘన విజయం సాధించిందని జగన్ స్పష్టం చేశారు. డిమాండ్ చేసేదాని కన్నా అభ్యర్థిస్తూ ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.