విజయనగరం: కాంగ్రెస్ పార్టీ తనను సీఎం చేస్తే రూ.1500 కోట్లు ఇచ్చేందుకు  తాను సిద్దమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనతో చెప్పారని నేషనల్ కాన్పరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు బొత్స సత్యనారాయణ. 

చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చి జాతీయ నాయకులను తీసుకువస్తున్నారని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యలను చంద్రబాబు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేతలే కౌంటర్ ఇచ్చారని స్పష్టం చేశారు. 

తాను ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నానని అలాంటి ఒత్తిడులు ఎక్కడా జరగలేదన్నారు. తానే ప్రత్యక్ష సాక్షినంటూ చెప్పుకొచ్చారు. ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న గులాం నబీ ఆజాద్ వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. 

అయితే అందుకు వైఎస్ జగన్ అంగీకరించలేదని చెప్పినట్లు బొత్స చెప్పారు.  ఓదార్పుయాత్రకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో వారితో విబేధించి వచ్చారే తప్ప ఏనాడు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని చెప్పుకొచ్చారు. 

ఒక పార్టీకి మద్దతుగా వచ్చి సంఘీభావం ప్రకటించాలని కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో వచ్చి వ్యాఖ్యలు చేసి ఫరూక్ అబ్ధుల్లా తన పరువు తీసుకున్నారని బొత్స అన్నారు. 

ఏపీలో చంద్రబాబు నాయుడు దగ్గర జాతి నాయకులు, జాతీయ నాయకులు తప్ప ఇంకెవరూ లేరని స్పష్టం చేశారు. దళితులు, బీసీలు, మైనారిటీలు చంద్రబాబు నాయుడుకు దూరంగా ఉన్నారని కేవలం ఆయన జాతి నాయకులు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. 

చంద్రబాబు నాయుడు దగ్గర టన్నుల కొద్దీ డబ్బు ఉందని అంతటి డబ్బు అందరి దగ్గర ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు నీచంగా వ్యవహరిస్తున్నారని ఇలాంటి వ్యక్తిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు బొత్స సత్యనారాయణ. 

మరోవైపు ఫరూక్ అబ్దుల్లాపై పరువు నష్ట దావా వేస్తామని బొత్స హెచ్చరించారు. అంతకుముందు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఫరూక్ అబ్దుల్లాపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఎబీ వెంకటేశ్వర రావును బదిలీ చేస్తే ఉలుకెందుకు?: బాబును ప్రశ్నించిన బొత్స

సీఎం సీటు కోసం జగన్ రూ.1500 కోట్ల ఆఫర్: ఫరూక్ అబ్దుల్లా సీరియస్ కామెంట్స్