విజయనగరం: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కంటే ఆర్థిక ఉగ్రవాది ఎవరూ ఉండరని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన బొత్స రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబుకు కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబు దగ్గర పాతాళబైరవి మంత్రం ఉందా అంటూ నిలదీశారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కంటే వెన్నుపోటు దారుడు మరోకరు ఉండరన్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు బదిలీతో సరిపోదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను కూడా బదిలీ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుకు ఉద్యోగం కంటే రాజకీయాలపైనే ఆసక్తి అంటూ చెప్పుకొచ్చారు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగం అని అయితే రాజకీయాలపైనే ఆసక్తి అంటూ విమర్శించారు. 

ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును ట్రాన్సఫర్ చేస్తే ఆయనకు వచ్చిన ఉలికెందుకు అని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ప్రతినిధులను ఢిల్లీకి పంపడం చూస్తుంటే సిగ్గేస్తోందని చెప్పారు. 

చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్న వ్యక్తి వెంకటేశ్వరరావు కాబట్టే అతని బదిలీపై తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీజీపీగా ఉన్న ఎస్.ఎస్.పి యాదవ్ పై టీడీపీ ఫిర్యాదులు చేసిందని గుర్తు చేశారు. 

దాంతో 2009 ఎన్నికల్లో ఎస్ఎస్.పి యాదవ్ ని ఎన్నికల బాధ్యత నుంచి తప్పించిందని చెప్పుకొచ్చారు బొత్స సత్యనారాయణ. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి భయపడలేదని, ఢిల్లీ వెళ్లి హంగామా చెయ్యలేదని, నా భద్రతకు ఇబ్బంది అని కానీ ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని చెప్పుకొచ్చారు బొత్స.