ఆంధ్రప్రదేశ్‌‌లోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సీనియర్ నేతలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిలో ఒకరు గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.

ఈ సారి ఎన్నికలతో ఆయన వరుసగా ఆరోసారి బరిలోకి దిగుతూ రికార్డుల్లోకి ఎక్కారు. పల్నాడు ప్రాంతంలోని గురజాలలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇతర ప్రముఖులు పోటీ చేశారు.

చాలా మంది కేవలం రెండు సార్లు మాత్రమే పరిమితమయ్యారు. అయితే యరపతినేనికి మాత్రం ఎవరికి దక్కని అదృష్టం లభించింది. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ చేతుల మీదుగా మొదటిసారి బీ ఫారం అందుకున్న శ్రీనివాసరావు 25 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.

ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కేవలం 131 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయినప్పటికీ 2004లో చంద్రబాబు... యరపతినేనికి సీటిచ్చారు. 2009, 2014 ఎన్నికల్లోనూ యరపతినేని గెలుపొందారు. గురజాల, మాచర్లను జంట నియోజకవర్గాలుగా ఆ ప్రాంత ప్రజలు పరిగణిస్తారు.

ఈ రెండు నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు తరచుగా అభ్యర్థులను మార్చేవి.. అయితే యరపతినేని మాత్రం సంప్రదాయాన్ని మార్చారు. అటు మాచర్లలోనూ వరుసగా ఇన్నిసార్లు పోటీ చేసిన అభ్యర్థులు లేరు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గురజాల టిక్కెట్‌ను యరపతినేనికి కేటాయించారు చంద్రబాబు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.06 గంటలకు శ్రీనివాసరావు నామినేషన్ వేయనున్నారు. తనకు ఇన్నిసార్లు అవకాశం రావటానికి ఇక్కడి ప్రజలే కారణమన్నారు. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని యరపతినేని తెలిపారు.