మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్ పేట పోలింగ్ కేంద్రం వద్ద గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరుగుతోంది.

మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా గురువారం రాత్రి 8 గంటల తర్వాత పోలింగ్ జరుగుతోంది. మంగళగిరి నుంచి నారా లోకేష్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ గురువారం రాత్రి తాడేపల్లి క్రిస్టియన్ పోలింగ్ కేంద్రానికి గురువారం రాత్రి వచ్చారు. 

ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

తానేం తప్పు చేశానని ధర్నాకు దిగిన నారా లోకేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తనయుడిని, క్యాబినెట్ మంత్రిని అయినా తనపైనే వైసిపి కార్యకర్తలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఇంత దారుణమైన ఎన్నికలను తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.