ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఆసక్తికర పోరు నడుస్తోంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన చిరకాల ప్రత్యర్ధి కాకాని గోవర్థన్ రెడ్డిల మధ్య ఇక్కడ హోరా హోరీ పోరు జరుగుతోంది.

ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న ఇద్దరు నేతలు.. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికలు మంత్రి చంద్రమోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైనవి. ఆయన వరుసగా మూడు సార్లు ఇక్కడి నుంచి ఓడిపోతూనే ఉన్నారు.

2004లో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో, 2009, 2014లో గోవర్థన్ రెడ్డి చేతిలో సోమిరెడ్డి పరాజయం పాలయ్యారు. దీనికి తోడు 2012లో కొవ్వూరులో జరిగిన ఉప ఎన్నికల్లో దగ్గరి బంధువు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతిలోనూ చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు.

గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ చంద్రబాబుతో సాన్నిహిత్యం దృష్ట్యా ఎమ్మెల్సీగా ఎన్నికై వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చాలా రోజుల తర్వాత మంత్రిగా అవకాశం రావడంతో ఆయన నిజయోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

వందల కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను చేయించారు. అలాగే కుమారుడికి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరిస్తూ, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటున్నారు.

తాను స్వయంగా రాజధాని అమరావతి కంటే ఎక్కువ సమయం సర్వేపల్లిలో ఉంటూ అక్కడి ప్రజల చేత నియోజకర్గానికి మంత్రిగా అనిపించుకున్నారు. మరోవైపు కాకాని గోవర్థన్ రెడ్డి కూడా బలంగానే ఉన్నారు.

ఇంజనీరింగ్‌ చదివిన ఆయన నియోజకవర్గంలోని అందరితో కలుపుకుని పోయే వ్యక్తిగా మన్ననలు అందుకున్నారు. జగన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలతో పాటు క్యాడర్ బలంగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం.

ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి సర్వేపల్లిలో హోరాహోరి పోరు స్పష్టం కనిపిస్తోంది. మరి సోమిరెడ్డి నాలుగోసారి మంత్రిగా గెలుస్తారా..? లేదా చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.