హిందూపురం: నందమూరి కుటుంబాన్ని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు ఆదిరిస్తున్నారు. నందమూరి తారకరామారావుతో పాటు ఆయన ఇద్దరు తనయులు ఈ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. ఇదే స్థానం నుండి  బాలకృష్ణ మరోసారి పోటీకి దిగుతున్నారు.

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీని దెబ్బతీసేందుకు మైనార్టీ అభ్యర్థిని వైసీపీ బరిలోకి దింపింది. రెండో సారి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బాలకృష్ణ టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.

1983 నుండి 1999 వరకు హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులకు ఈ సెగ్మెంట్ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారు.  2004, 2009 ఎన్నికల్లో  నాలుగంకెల మెజారిటీ మాత్రమే వచ్చింది. 2014 ఎన్నికల్లో బాలకృష్ణకు 16 వేల మెజారిటీ వచ్చింది.

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,19,012 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95,500 మంది బీసీలే. బీసీ సామాజిక వర్గంలో కూడ వాల్మీకి వర్గానికి చెందినవారు 42,000 మంది ఓటర్లున్నారు. పద్మశాలీలు 21,000, వడ్డెర కులస్తులు 20 వేల మంది ఉన్నారు. ముస్లింలు 55 వేల మంది ఉన్నారు. హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం ఓటర్లు కూడ గణనీయంగా ఉన్నారు.

2009 ఎన్నికల్లో టీడీపీ అబ్దుల్ ఘనీకి టిక్కెట్టు కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఘని విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఘనిని కాదని బాలకృష్ణను బరిలోకి దింపాడు చంద్రబాబు. అయితే ఘనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీని బాబు అమలు చేయలేదు. దీంతో ఘని ఆరు మాసాల క్రితం వైసీపీలో చేరాడు.  ఘనిని కాదని మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌ను  బరిలోకి దింపింది.

ఎన్టీఆర్ కొడుకుగా బాలకృష్ణకు కలిసొచ్చే అంశం, అంతేకాదు సినీ గ్లామర్ కూడ ఆయనకు అదనంగా కలిసి రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బలమైన నాయకత్వంతో పాటు కార్యకర్తల బలం టీడీపీకి కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరో వైపు హిందూపురం పట్టణ ప్రజల నీటి సమస్యను తీర్చడం బాలకృష్ణకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడ అదనంగా కలిసి రానున్నాయని  తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పీఏల పెత్తనంపై  పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. ఇక వైసీపీ అభ్యర్ధిగా ఇదే స్థానం నుండి గత ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా అతనికి టిక్కెట్టు ఇవ్వలేదు.మాజీ ఐపీఎస్ అధికారికి ఇక్బాల్‌కు  వైసీపీ టిక్కెట్టు కేటాయించింది

 మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్బాల్‌కు ఇది కలిసొచ్చే అవకాశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పోలీసు అధికారిగా ఆయనకు ఉన్న గుర్తింపు, రెడ్డి సామాజిక వర్గం తమ వైపు ఉండడం కలిసివచ్చే అవకాశం ఉందని  వైసీపీ నేతలు భావిస్తున్నారు.వైసీపీ నేతల్లో వర్గపోరు ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం లేకపోలేదని  టీడీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.