భీమవరం: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి కూడా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలను నిర్ణయించారు. 

భీమవరంలో పవన్ కల్యాణ్ కు విజయం నల్లేరు మీద బండి నడకేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల అభ్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కోబోతున్నారు. 

బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 15 శాసనసభా స్థానాలను, రెండు లోకసభ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం జనసేన వామపక్షాలతో, బిఎస్పీతో పొత్తు పెట్టుకుని కదనరంగంలోకి దిగింది. 

భీమవరం నుంచి మరోసారి విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పూలపర్తి రామాంజనేయులు పట్టుదలతో ఉన్నారు. అయితే, ఆయన స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కుంటున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దానికితోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 2004 ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపి అభ్యర్థిపై ఓటమి చవి చూశారు. 

ప్రస్తుత తరుణంలో కుల సమీకరణాలు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. నరసూపరం, ఉండి, ఆచంట, తదితర ప్రాంతాల్లో కుల సమీకరణాలు ఆయనకు కలిసి వస్తాయని అంటున్నారు. అయితే, పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ ను అంత సులభంగా కొట్టిపారేయడదానికి లేదు.