అనంతపురం జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచిన ఆ కుటుంబం నుంచి రెండో తరం రాజకీయాల్లోకి ప్రవేశించింది.

పరిటాల రవి తనయుడు శ్రీరామ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లు రవీంద్ర రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన ఆయన భార్య సునీత ఎన్నికల బరి నుంచి వైదొలగి కుమారుడు శ్రీరామ్‌కు అవకాశం ఇచ్చారు.

దీంతో ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రజల దృష్టి నెలకొంది. యువకుడైనా ప్రజాభిమానం మెండుగా ఉన్న శ్రీరామ్ .. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో తలపడుతున్నారు.

2004, 2009లలో వరుసగా టీడీపీ తరపున సునీత ఆయనపై గెలిచారు. ప్రస్తుతం ఆమె చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. గత రెండు దఫాలుగా ఓడుతున్న తోపుదుర్తి ఈ సారి విజయం గ్యారెంటీ అని నమ్మకంగా చెబుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు వైఎస్ జగన్‌ ఇమేజ్ తనకు కలిసి వస్తుందని తోపుదుర్తి భావిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం కింద రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాలున్నాయి.

నియోజకవర్గంలో మొత్తం 2,31,357 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో సగానికి పైగా బీసీలే. పరిటాల బ్రాండ్ ఇమేజ్‌తో పాటు బీసీల్లో ఉన్న అభిమానం, సునీత రాప్తాడులో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని శ్రీరామ్ బలంగా నమ్ముతున్నారు.

అయితే గత కొన్ని దశాబ్ధాలుగా పరిటాల కుటుంబ ఆధిపత్యం సాగుతుండటంతో పాటు కొందరికే కాంట్రాక్టు పనులు దక్కుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విషయానికొస్తే.. వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో పాటు బలమైన రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం.

అయితే నియోజకవర్గంలో సగానికి పైగా ఉన్న బీసీలను ఆకట్టుకోవడంలో వైఫల్యం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తారనే ఆరోపణలు ప్రతిబంధకంగా మారాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పరిటాల కుటుంబం ఇంతవరకు ఓటమి పాలవ్వలేదు. మరి ఈసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదంటే తోపుదుర్తి కొత్త చరిత్ర సృష్టిస్టారా అన్నది తెలియాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.