ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కీలక సభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ముందుండి నడిపించారు.

ఈ కృషికి గుర్తింపుగానే తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు చంద్రబాబు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుల కావడంతో ఆయన మరోసారి బరిలో నిలవబోతున్నారు. పార్టీ అధికారికంగా ఆయన పేరును ఖరారు చేయలేదు.

అయితే ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ సమావేశంలో ప్రత్తిపాటిని తమ అభ్యర్ధిగా ఖరారు చేస్తూ నేతలు తీర్మానించారు.

1999లో తొలిసారి టీడీపీ తరపున పోటీ చేసిన పుల్లారావు... నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సోమేపల్లి సాంబయ్యపై ఘన విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ చేతిలో కేవలం 212 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌పై 19,813 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌ను పుల్లారావు మరోసారి ఓడించారు.

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎవరికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. అయితే తొలిసారిగా ప్రత్తిపాటికి ఆ అవకాశం దక్కింది. 2014కు ముందు 9 సంవత్సరాల పాటు ఆయన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

మరోవైపు పుల్లారావు హ్యాట్రిక్ విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ను కాదని విడుదల రజినీ అనే మహిళను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది.

రజినీ సైతం అందరినీ కలుపుకుపోతూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అయితే చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడంతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది.

కాగా, జనం నాడిని బట్టి పుల్లారావుకు మరోసారి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలోనూ పుల్లారావుకు ఎడ్జ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నార్నే రంగంలోకి దిగితే మాత్రం ఆయన పరిస్థితి కాస్త క్లిష్టంగా మారే అవకాశాలు లేకపోలేదు.