టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరింది. అనారోగ్య కారణాలతో తాను పోటీకి దూరంగా ఉండి, భార్యకు పెద్దాపురం సీటు సంపాదించారు తోట నరసింహం. ఈ క్రమంలో తోట వాణి అక్కడ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో తలపడుతున్నారు.

ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడం, బలమైన ఆర్ధిక నేపథ్యం ఉండటంతో పెద్దాపురంలో పెద్ద పోటీ జరిగేలా ఉంది. కాపు సామాజిక వర్గంతో పాటు బీసీలు, ఎస్సీలు అభ్యర్థుల గెలుపును నిర్దేశిస్తున్నారు.

నిమ్మకాయల చినరాజప్పతో తోట నరసింహం కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వీరిద్దరు ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు.

2014 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి బరిలోకి దిగిన రాజప్ప ఇక్కడ విజయం సాధించారు. ఆ వెంటనే హోంశాఖతో పాటు డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

అధికారంలో ఉండటంతో పాటు వివాదరహితుడు కావడంతో పాటు బలమైన ఆర్ధిక నేపథ్యం ఉంది. మరోవైపు తోట నరసింహం జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన వారు. 2004, 09లో ఇక్కడి నుంచి గెలిచి వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరారు. 2014లో కాకినాడ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. పార్లమెంటు‌లో టీడీపీ లోక్‌సభాపక్షనేతగా వ్యవహరించారు. అనారోగ్యం కారణంగా తాను ఈసారి పోటీ చేయలేనని తన భార్యకు జగ్గంపేట టికెట్ కావాలని నరసింహం చంద్రబాబును కోరారు.

అయితే అక్కడ బలమైన నేత జ్యోతుల నెహ్రూ ఉండటంతో బాబు కుదరదన్నారు. ఆ వెంటనే వైసీపీలో చేరిన నరసింహం ఫ్యామిలీకి జగన్ పెద్దాపురం టికెట్ ఇచ్చారు. నరసింహం భార్య వాణి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

సామర్లకోట, పెద్దాపురం మునిసిపాలిటీలు, రెండు రూరల్ మండలాలతో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో 1983 నుంచి 2014 వరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేశారు.

అయితే 2014లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన చంద్రబాబు అమలాపురానికి చెందిన చినరాజప్పను బరిలో దించారు. కాపు సామాజికవర్గానికి తోడు టీడీపీ పవనాలు బలంగా వీయడంతో నిమ్మకాయంలో విజయం సాధించారు.

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించినా వివాదాస్పద అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ ఆరోపణలతో పాటు పార్టీలో వివాదాలను సమన్వయం చేసుకోలేకపోవడం చినరాజప్పకు ప్రతిబంధకాలుగా మారాయి.

మరోవైపు తోట వాణి విషయానికొస్తే ఈ కుటుంబానికి పెద్దాపురంలో పెద్ద ఎత్తున బంధుత్వాలు ఉన్నాయి. దీనికి తోడు కాపు వర్గానికి చెందిన వారే కావడం అదనపు బలం. అయితే ఖర్చుకు వీరు వెనుకంజ వేయటం, పార్టీలో కొద్దిరోజుల క్రితమే చేరడంతో బలమైన నేతల అండ వాణికి లేదు.