అమరావతి: దళితులను టీడీపీ చులకన చూస్తోందని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ నేతలు తనను అవమానపరుస్తున్నారని ఆమె గుర్తు చేశారు.

మంగళవారం నాడు అమరావతిలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాతో మాట్లాడారు.అనంతవరంలో టీడీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారని ఆమె చెప్పారు. నలుగురు టీడీపీ నేతలతో పాటు చంద్రబాబుపై కూడ కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ ను ప్రభుత్వ కార్యక్రమాల్లో తన పక్కన ఎన్నిసార్లు కూర్చోపెట్టుకొన్నారని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో దళితులకు న్యాయం జరగలేదన్నారు. అందుకే దళితులు వైఎస్ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపారన్నారు. దళితులను అణగదొక్కేందుకు టీడీపీ ప్రయత్నం చేసిందన్నారు. రాజధాని గ్రామాల్లో టీడీపీ నేతలు రౌడీల మాదిరిగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

తనపై ఇప్పటికే మూడు దఫాలు ఇదే రకంగా వ్యవహరించారని ఎమ్మెల్యే  శ్రీదేవి గుర్తు చేశారు. తనను కులం పేరుతో దూషించిన కేసులో ఇప్పటికే ఒకరు అరెస్టయ్యారని, మరో ముగ్గురు తప్పించుకొని  తిరుగుతున్నారని ఆమె చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ డీజీపీ, ఎస్పీని కలిసినట్టుగా శ్రీదేవి చెప్పారు.

సంబంధిత వార్తలు

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి: నలుగురిపై కేసు

టీడీపీ నేతల దూషణలు: కన్నీళ్లు పెట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి