సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీవీ దేశ భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించారని.. తన అక్రమ సంపద కోసం దేశ భద్రతనే పణంగా పెట్టారని ఆయన ఆరోపించారు.

వెంకటేశ్వరరావుపై కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. ఏబీని తక్షణం సర్వీస్ నుంచి తొలగించాలని భాస్కర్ రెడ్డి కోరారు. వెంకటేశ్వరరావు తెలంగాణ, బెంగళూరులలో వందల ఎకరాలు కొన్నారని చెవిరెడ్డి ఆరోపించారు.

Also Read:ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలపై కేంద్ర సంస్థతో దర్యాప్తు: ఆ 7 అభియోగాలు ఇవే

విధుల నుంచి సస్పెన్షన్ చేయడాన్ని ఏబీవీ వరంగానే భావిస్తారు తప్పించి పనిష్మెంట్‌గా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సంఘ విద్రోహ శక్తులతో వెంకటేశ్వరరావు చేతులు కలిపారని.. ఏబీవీతో పాటు ఘట్టమనేని శ్రీనివాస్‌పైనా విచారణ జరపాలని చెవిరెడ్డి కోరారు.

ఈ వ్యవహారంపై ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు డీఎస్పీలతో ఆయన భూదందాలు చేయించారని.. ఏబీ వెంకటేశ్వరరావు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని భాస్కరరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏబీవీపై తక్షణం లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వర రావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వర రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read:ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌:కేశినేనిసెటైర్లు, కౌంటరిచ్చిన ఐపీఎస్ అధికారి

ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్ష, అపీల్) నిబంధనల నియమం 3(1) కిం ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో తెలిపారు. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు నివేదికలో తేలిందని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర రావు పోలీసు ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు.