విజయవాడ: తన సస్పెన్షన్‌పై సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కౌంటరిచ్చారు.  ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలై, వైసీపీ అధికారంలోకి  రావడానికి  కారణమైన ఏబీ వెంకటేశ్వరరావుకు  సన్మానం చేస్తారనుకొంటే సస్పెండ్ చేస్తారా అని జగన్‌ను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారం నాడు ఉదయం ట్వీట్ చేశారు.

Also read:ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్: సన్మానం చేస్తారనుకొంటే ఇలానా.. కేశినేని సెటైర్లు

 

ఈ ట్వీట్ కు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అంతే స్థాయిలో స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో  టీడీపీ గెలవడానికి తానే కారణమని అంబటి రాంబాబు కడుపుబ్బా నవ్వించారని ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

ఏమిటోనంటి ఎంపీ గారు  అంటూ ఆయన  నానికి కౌంటరిచ్చారు.  మీరంతా పార్లమెంట్‌లో కలిసి మెలిసే ఉంటారు.   అందరూ కలిసి ఓ అభిప్రాయానికి రండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో అనే విషయమై తనకు  కూడ క్లారిటీ వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో  ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్టుగా  ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.  ఈ కారణంగానే  ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది ప్రభుత్వం. 

చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో ఇంటలిజెన్స్ ఏపీ చీఫ్ గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఆ సమయంలో వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంలో ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా పనిచేశారని ఆ సమయంలో  వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసింది.

వైసీపీ ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును పక్కన పెట్టింది. ఎనిమిది మాసాలుగా ఆయనకు ఎక్కడా కూడ పోస్టింగ్ ఇవ్వలేదు. సెక్యూరిటీ పరికరాల కుంభకోణంలో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.