సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని సర్కార్ కసరత్తు చేస్తోంది.

ప్రాథమిక విచారణలో భాగంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఏబీ వ్యవహరించినట్లు గుర్తించిన ప్రభుత్వం సీఐడీ చేత విచారణ జరిపేందుకు సిద్ధమైంది. అంతర్గత పరికరాలతో పాటు కొనుగోళ్ల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Also Read:ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌:కేశినేనిసెటైర్లు, కౌంటరిచ్చిన ఐపీఎస్ అధికారి

అవసరమైన పక్షంలో కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన విధులు నిర్వర్తించిన కాలంలో పరికరాల కొనుగోలుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు వెంకటేశ్వరరావుపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయాలనే ప్లాన్‌లో ఉంది ఏపీ ప్రభుత్వం. కాగా ఇప్పటికే 7 అభియోగాలపై వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది ఏపీ సర్కార్.

ఏడు అభియోగాలను చూస్తే.. ఇజ్రాయిల్‌కు చెందిన రక్షణ సంస్థతో అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా ఆధారాలు లభించాయి. ఇందుకు సంబంధించి ప్రైమరీ బిడ్డింగ్ వ్యవహారంలో ఏబీ కీలకపాత్ర వహించినట్లుగా తెలుస్తోంది.

ఈ లావాదేవీలకు సంబంధించి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయి కృష్ణకు ఈ ప్రాజెక్ట్ దక్కేవిధంగా పక్షపాతపూరితంగా వ్యహరించినట్లు మరో అభియోగం నమోదైంది. దీనితో పాటు ఇంటెలిజెన్స్ రహస్యాలను విదేశీ రక్షణ సంస్థలతో పంచుకోవడం ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఆయన వ్యవహారించారు.

Also Read:మానసికంగా ఇబ్బంది లేదు, చట్టపరమైన చర్యలు: ఏబీ వెంకటేశ్వరరావు

అలాగే పోలీస్ శాఖ కోసం కొనుగోలు చేసిన సాంకేతిక పరికరాల్లో పెద్ద మొత్తంలో నాసిరకమైనవే తీసుకున్నారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి అనేక టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు మరో ఆరోపణ.

సీనియర్ పోలీస్ అధికారుల సూచనలు పట్టించుకోకుండా సొంతంగా వ్యవహరించారని... ఎలాంటి అర్హత లేని కంపెనీలకు వెంకటేశ్వరరావు అనుకూలంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఈ కేసులో విజయవాడ నగరాన్ని దాటకుండా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.