వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కూటమి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేస్తోంద‌న్నారు. తాజాగా వైసీపీ లీగ‌ల్ సెల్ ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన భేటీలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సంద‌ర్భంగా జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం న్యాయం, ధర్మం కనిపించని పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలని, వారి సేవలకు పార్టీ ఎప్పటికీ గుర్తింపు ఇస్తుందని హామీ ఇచ్చారు.

తప్పుడు కేసులు, బెదిరింపుల వాతావరణం

రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టి ప్రజల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని, ప్రలోభాలు పెట్టి లేదా బెదిరించి వాంగ్మూలాలు తీసుకుంటున్నారని అన్నారు. ఆధారాలు లేకుండానే కుట్రలు జరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల పాత్ర మరింత ముఖ్యమైందని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో న్యాయవాదుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టినట్లు జగన్ గుర్తుచేశారు. లా నేస్తం పథకం ద్వారా సహాయం అందించడం, జీపీలు-ఏజీపీ పోస్టుల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం, న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు కేటాయించడం, ఇన్సూరెన్స్ వాటా ప్రభుత్వం భరించడం వంటి నిర్ణ‌యాలు తీసుకున్నామ‌న్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ సదుపాయాలు క‌త్తిరించార‌ని విమ‌ర్శించారు.

Scroll to load tweet…

అన్నింట్లో అవినితే

ఇక లిక్కర్ విక్రయాల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందని జ‌గ‌న్ ఆరోపించారు. గ్రామాల వారీగా బెల్టుషాపులు నడుస్తున్నాయని, ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఆదాయం దోపిడీ అవుతోందని, పోలీసుల సహకారంతో పేకాట క్లబ్బులు కూడా నడుస్తున్నాయని అన్నారు.

అమరావతి ప్రాజెక్టుల విషయంలో కూడా అవినీతి బహిర్గతం అవుతోందని ఆరోపించారు. చదరపు అడుగుకు అధిక ఖర్చుతో పనులు జరుపుతూ భారీ కమీషన్ దందాలు జరుగుతున్నాయని, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట దోపిడీ జరుగుతోందని విమర్శించారు.

“పార్టీ కోసం కష్టపడేవారికి ప్రాధాన్యత”

జగన్ 2.0 పాలనలో పార్టీ కోసం కృషి చేసే ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక డేటాబేస్, మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఈ ఫిర్యాదులు డిజిటల్ లైబ్రరీలో రికార్డ్ అవుతాయని, ఆధారాలపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హామీ ఇచ్చారు.