గుంటూరు: డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దళిత డాక్టర్ ను నాశనం చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని  ఆరోపించారు. సుధాకర్ తనకు ఇస్తున్న మందులు, దాని ద్వారా కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు లేఖ రాశారని....తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని లేఖలో వెల్లడించాడని తెలిపారు. సుధాకర్ డాక్టర్ కాబట్టి తనకు ఇస్తున్న మందుల వివరాలన్నింటినీ లేఖలో పేర్కొన్నారని అన్నారు. ఒక డాక్టర్ విషయంలోనే ఇలా వ్యవహరిస్తే ఇక సామాన్యుల పరిస్థితేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు.

డాక్టర్ సుధాకర్ ను ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం పర్యవేక్షణలో ఉంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించిందంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో అర్ధమవుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో సీబీఐ విచారణ కోరిన వైసిపి నాయకులు ఇప్పుడెందుకు వణుకుతున్నారు?
 అని నిలదీశారు.

జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే ఆయన సొంత సోదరి హైకోర్టును ఆశ్రయించింది వాస్తవం కాదా? అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం జగన్ ప్రభుత్వం గుర్తించాలని చంద్రబాబు సూచించారు.

read more   సీబీఐ చేతుల్లోకి డాక్టర్ సుధాకర్ కేసు: హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించనున్న ఏపీ సర్కార్

తనకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్ సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ  చికిత్సతో తనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు.డాక్టర్ సుధాకర్ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రి సూపరింటెండ్ కు బుధవారం నాడు లేఖ రాశారు.మెరుగైన సౌకర్యాలు కలిగిన ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సూపరింటెండ్ ను ఆ లేఖలో కోరారు.ఎలాంటి పరీక్షలు చేయకుండానే తాను మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని సుధాకర్ ఆరోపించారు. 

 ఈ నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ ను విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో డాక్టర్ సుధాకర్ రోడ్డుపై రభస సృష్టించడంతో అతడిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ సమయంలో డాక్టర్  సుధాకర్ పై దాడి చేసిన కానిస్టేబుల్‌ను సీపీ సస్పెండ్ చేశారు.

డాక్టర్ సుధాకర్ ను ప్రస్తుతం విశాఖపట్టణం మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ కు అందిస్తున్న చికిత్సను బయటపెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇటీవలనే డిమాండ్ చేశారు. 

read more  డాక్టర్ సుధాకర్‌తో మాట్లాడినట్టుగా నిరూపించండి: టీడీపీకి మంత్రి సురేష్ సవాల్

డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దాడి చేసిన ఘటనపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిత రాసిన లేఖను పిటిషన్ గా స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపింది. డాక్టర్ సుధాకర్ పై దాడి ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఈ నెల 22వ తేదీన ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.