Asianet News TeluguAsianet News Telugu

రాజోలు, రాజానగరంలలో పోటీ: పవన్ నిర్ణయం వెనుక కారణమిదీ..


రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వ్యూహాత్మకంగానే ఈ రెండు నియోజకవర్గాలను జనసేన ఎంపిక చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 Why Pawan Kalynan decided to Contest From Razolea and Rajanagaram Assembly Segments lns
Author
First Published Jan 27, 2024, 4:45 PM IST | Last Updated Jan 27, 2024, 4:45 PM IST


అమరావతి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినందున రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడ ప్రకటించారు. అయితే  ఈ రెండు అసెంబ్లీ స్థానాల పేర్లనే  పవన్ కళ్యాణ్ ఎందుకు  ప్రకటించారనే  చర్చ తెర మీదికి వచ్చింది. 

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సీపీఐ,సీపీఐ(ఎం), బీఎస్‌పీలతో కలిసి  పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జనసేన ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో  విజయం సాధించింది. రాజోలు అసెంబ్లీ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన  రాపాక వరప్రసాద్  విజయం సాధించారు.   ఎన్నికల తర్వాత  చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  రాపాక వరప్రసాద్  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ)కి మద్దతు ప్రకటించారు. రాపాక వరప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు గతంలోనే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

రాజోలు జనసేన పార్టీ సిట్టింగ్ స్థానం. దీంతో  రాజోలు  అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో జరిగిన ఎన్నికల్లో   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  అల్లూరి కృష్ణంరాజు  రాజోలు నుండి విజయం సాధించారు.  2009లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  రాపాక వరప్రసాద్ ఈ స్థానం నుండి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో  రాజోలు అసెంబ్లీ స్థానం 2009లో  ఎస్‌సీలకు రిజర్వ్ చేశారు.

2014 ఎన్నికల్లో  ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన  తర్వాత రాష్ట్ర విభజన జరిగింది.  2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి గొల్లపల్లి సూర్యారావు  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై  విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో  జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్  విజయం సాధించారు.  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బొంతు రాజేశ్వరరావుపై  నెగ్గారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ స్థానం నుండి  ప్రజా రాజ్యం అభ్యర్ధిగా బరిలోకి దిగిన  నల్లి వెంకట కృష్ణ మాలిక్ కు 46,450 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బత్తుల రాముకు కేవలం  25, 286 ఓట్లు మాత్రమే దక్కాయి.ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 22.43 శాతం ఓట్లు,  టీడీపీకి  17. 39 శాతం ఓట్లను కోల్పోయింది. 

also read:జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్: 2019 రికార్డు పునరావృతం చేస్తారా?

2019 ఎన్నికల్లో  ఈ స్థానంలో జనసేన విజయం సాధించింది .రాజోలు అసెంబ్లీ స్థానంలో  జనసేన  32.92 శాతం ఓట్లను దక్కించుకుంది. వైఎస్ఆర్‌సీపీ 2014 ఎన్నికలతో పోలిస్తే  13.45 శాతం,  తెలుగు దేశం పార్టీ  18.92 శాతం ఓట్లను కోల్పోయింది.ఈ రెండు పార్టీల ఓట్లు జనసేనకు  వైపునకు మళ్లాయి.  వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కుతుందని భావించినా  ఆ పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో రాపాక వరప్రసాద్  జనసేనలో చేరి  విజయం సాధించారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని  జనసేన రాజోలు అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలను  రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

also read:పవన్ వ్యాఖ్యల ఎఫెక్ట్: టీడీపీ ఆఫీసుకి రాజోలు, రాజానగరం తెలుగు తమ్ముళ్లు, సర్ధిచెప్పిన అచ్చెన్నాయుడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజానగరం అసెంబ్లీ స్థానం నుండి  2004, 2009 ఎన్నికల్లో  తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పెందుర్తి వెంకటేష్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో  తొలిసారిగా ఈ స్థానంలో  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి జక్కంపూడి రాజా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి రాయపూడి  ప్రసాద్ అలియాస్ చిన్నాకు  20,847 ఓట్లు వచ్చాయి.  11.79 శాతం  ఓట్లు దక్కాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి ముత్యాల శ్రీనివాస్ కు  38,655 ఓట్లు దక్కాయి.

also read:టీడీపీ-జనసేన మధ్య ఏం జరుగుతోంది: పవన్ వ్యాఖ్యల వెనుక మతలబు ఏమిటి?

రాజానగరంలో అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జీ  బత్తుల  బలరామకృష్ణ పార్టీ కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.  2019 తో పోలిస్తే  రాజానగరంలో తమ ప్రాబల్యం పెరిగిందని ఆ పార్టీ భావిస్తుంది.  ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై  జనసేన  పార్టీ ఫోకస్ పెట్టింది.  ఈ క్రమంలోనే  రాజానగరంలో  పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios