టీడీపీ-జనసేన మధ్య ఏం జరుగుతోంది: పవన్ వ్యాఖ్యల వెనుక మతలబు ఏమిటి?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీశాయి.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఈ నెల 26వ తేదీన జనసేన కార్యకర్తల సమక్షంలో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో తెలుగు దేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సీట్ల సర్ధుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో విషయమై చర్చిస్తున్నారు. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఈ తరుణంలోనే తెలుగు దేశం, జనసేనలు చెరో రెండుస్థానాల్లో పోటీ విషయమై ప్రకటన ప్రస్తుతం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రా కదిలిరా పేరుతో చంద్రబాబు నాయుడు సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు, మండపేటల్లో ఇటీవల చంద్రబాబు సభలు నిర్వహించారు. అరకులో నిర్వహించిన సభలో స్థానిక టీడీపీ నేత దొన్ను దొర అరకు నుండి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు.
మండపేటలో జరిగిన తెలుగు దేశం సభలో మండపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మరో సారి బరిలోకి దిగుతారని చంద్రబాబు ప్రకటించారు. మండపేట అసెంబ్లీ స్థానంలో జోగేశ్వరరావు పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబు సభ తర్వాత జనసేన నేతలు సమావేశమయ్యారు.ఈ విషయమై చర్చించారు. చంద్రబాబు ప్రకటనపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
also read:జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్: 2019 రికార్డు పునరావృతం చేస్తారా?
అరకు, మండపేటల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి స్థానిక పార్టీ నేతలు తీసుకు వచ్చారు. ఈ పరిణామాలపై జనసేన నాయకత్వం చర్చించినట్టుగా కూడ ప్రచారం సాగుతుంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. చంద్రబాబుపై ఎంత ఒత్తిడి ఉంటుందో .. తనపై కూడ అంతే ఒత్తిడి ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకే కాదు తనపై కూడ సీట్ల విషయమై పార్టీ శ్రేణుల నుండి ఒత్తిడి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ రెండు స్థానాలు ప్రకటించినందున.. తనపై ఉన్న ఒత్తిడి మేరకు రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
also read:అచ్చు సినిమానే: కవలలను విడదీసిన తండ్రి, 19 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా చెల్లెళ్లు
జనసేన శ్రేణులను సంతృప్తి పర్చేందుకు పవన్ కళ్యాణ్ రెండు సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారా... లేక తెలుగు దేశం పార్టీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినందున కౌంటర్ గా రెండు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారా అనే చర్చ కూడ లేకపోలేదు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఉండాలనేది తమ ఉద్దేశ్యమని పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో మరోసారి పునరుద్ఘాటించారు. ఈ కారణంగానే కొన్ని విషయాలపై తాను స్పందించడం లేదన్నారు. తెలుగు దేశం, జనసేనల మధ్య పొత్తుకు విఘాతం కల్గించేందుకు ప్రత్యర్థులు విమర్శలు చేస్తారని కూడ ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని లోకేష్ వ్యాఖ్యానించినా కూడ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదనే తాను ఇలాంటి అంశాలపై స్పందించలేదని పవన్ కళ్యాణ్ వివరించారు.
సంక్రాంతికి తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావించింది. అయితే జనసేన, తెలుగు దేశం పార్టీ మధ్య సీట్ల సర్ధుబాటు అంశం ఇంకా కొలిక్కి రానందున సీట్ల ప్రకటన చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
గత ఎన్నికల్లో ముప్పై నుండి 40 మంది జనసేన ఎమ్మెల్యేలను గెలిపించినా.. కనీసం తనను ఎమ్మెల్యేగా గెలిపించినా పరిస్థితి మరోలా ఉండేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికల నాటికి ఇప్పటికి పరిస్థితి తేడా ఉందని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. జనసేన ఓటు బ్యాంకు 18 శాతం నుండి పెరిగిందనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు జనసేనలో చేరుతున్నారు. ఈ తరుణంలో అందరికీ టిక్కెట్ల కేటాయింపు కూడ జనసేనకు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. ఈ కారణంగా సీట్ల సర్ధుబాటుపై తెలుగు దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీపై ఎవరికి తోచినట్టుగా వారు ఊహగానాలు చేసుకుంటున్నారు.
మరోవైపు జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు కూడ చర్చకు దారి తీశాయి. చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ సూత్రాన్ని ఈ సందర్భంగా నాగబాబు ప్రస్తావించారు. మరో వైపు తాను పెట్టే ప్రతి పోస్టుకు ఏదో ఒక అర్ధం ఉంటుందని భావించవద్దని కూడ మరో పోస్టు పెట్టారు. ఈ విషయమై ఆలోచించి గుమ్మడికాయ దొంగలు కావొద్దని అవ్వొద్దన్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీకి వెళ్లారు. బీజేపీ అగ్రనేతలు జే.పీ. నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లినట్టుగా చర్చ సాగుతుంది.