విజయవాడ: ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా  విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుండి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి  శనివారం  నాడు  8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకరస్థాయిలో నీరు ప్రవహిస్తోంది. 

దీంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. పట్టణంలోని గీతానగర్, రామలింగేశ్వరనగర్, బాలాజీ నగర్ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. రామలింగేశ్వరనగర్‌లోని రఘు రోడ్డు, గాంధీ కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.నది ముంపు ప్రాంతాలైన భుపేష్ గుప్తా నగర్, కృష్ణ లంక, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది.

పామర్రు నియోజకవర్గంలో 9లంక గ్రామాలు పూర్తిగా జలమయ్యం అయ్యాయి. దీంతో  ఆయా గ్రామాల్లో గల 4000 మంది జనాభాను పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలాన్ని వరద నీరు చుట్టుముట్టింది. 

కొక్కిలిగడ్డ హరిజనవాడలో 278 ఇళ్లు నీటమునిగిపోయాయి. బొబ్బర్లంకలో నివాస గృహాలు నీటమునిగాయి. ఎడ్లలంక గ్రామాన్ని కూడా కృష్ణ వరద ముంచెత్తింది. కరకట్టకు లోపల ఉన్న గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పులిగడ్డ శివారు పల్లెపాలెం, రేగుల్లంక, దక్షిణ చిరువోలు లంక గ్రామాలు జలదిగ్భందమయ్యాయి.

గుంటూరు జిల్లా కొల్లూరు, కొల్లిపొర మండలాల పరిధిలోని 15 గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అరవింద వారధి వద్ద గండి కారణంగా కృష్ణా కరకట్ట వరకు నీరు చేరింది. వేల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు వదిలి వచ్చేందుకు అక్కడి ప్రజలు నిరాకరిస్తున్నారు. 

అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పెద్దమద్దూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విజయవాడ-అమరావతి మధ్య నాలుగో రోజు రాకపోకలు నిలిచిపోయాయి. మునుగోడు వద్ద నక్కవాగు ప్రవాహంతో క్రోసూరు- అచ్చంపేట మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. 

సంబంధిత వార్తలు

హోం మంత్రి ఏం చేస్తారు?: చెవిటికల్లు గ్రామస్తులపై ఎమ్మెల్యే ఆగ్రహం

కృష్ణమ్మ ఉగ్రరూపం, నాటు పడవ బోల్తా: 11ఏళ్ల బాలిక గల్లంతు

పోటెత్తిన వరద: లంక గ్రామాల్లోకి నీరు, అప్రమత్తమైన సర్కార్