విజయవాడ: ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా  ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడంతో  ప్రకాశం బ్యారేజీ నుండి సుమారు ఆరు లక్షల క్యూసెక్కుల నీరు  వస్తోంది. దీంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు మరింత వచ్చే అవకాశం ఉండడంతో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.  యుద్ద ప్రాతిపదికన  లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

విజయవాడ నగరం నుండి  సుమారు 2 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కృష్ణా,  గుంటూరు జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో  రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో  ఇంకా వరద ప్రమాదం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

కృష్ణా కరకట్ట వద్ద వరద నీటి కారణంగా  కొన్ని చోట్ల పగుళ్లు వచ్చాయి.  కృష్ణా జిల్లాలోని ఫెర్రీలో వరద నీరు చొచ్చుకు వచ్చింది. వరద సహాయక చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ గురువారం నాడు ఆదేశించారు.

వరద ప్రవాహం పెరగడంతో  కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం వద్ద ఉన్న మెట్లను నీటి ప్రవాహం తాకింది.  కరకట్టపై ఉన్న భవనాల్లోకి నీరు వచ్చినట్టుగా తెలుస్తోంది. సీఆర్డీఏ అధికారులు ఈ విషయమై వరద నీటిని పరిశీలిస్తున్నారు.

భారీగా నీటిని విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను నిషేధించారు.  చెవిటికల్లు, మున్నలూరు, గనిఅట్కూరు, మొగులూరు, కునికకపాడు, ఉస్టేపల్లి, కాసారబాద్, కొండవటికల్లు, ఈటూరు, సంగల్లపాలెం, పున్నవల్లి, పొక్కనూరు గ్రామాలు పాక్షికంగా నీట మునిగాయి.