ఏపీలో రావణ రాక్షస రాజ్యం కొనసాగుతోంది...హిట్లర్ పాసిజం పరాకాష్టకు చేరిందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద దీక్ష చేపట్టిన దళిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ను  పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు.

150 రోజులుగా ప్రజా రాజధానిని కాపాడుకోవడానికి రైతులు, కూలీలు, మహిళలు, అన్ని వర్గాలు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్రంలోని అన్ని పార్టీలు, వర్గాలూ సంఘీభావం తెలుపుతుంటే అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకూ సబబని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

శాంతియుతంగా ఉద్యమ సాగిస్తున్న రైతులను అరెస్ట్ చేసి మూడు రాజధానులంటూ రాజధానిని విశాఖకు తరలించే యత్నం చేయడం దుర్మార్గమన్నారు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ బడుగులకు అండగా నిలుస్తున్న తెదేపా నేతలపై పులివెందుల చట్టాన్ని అమలు పరిస్తే తమ పార్టీ ఊరుకోదని వెంకట్రావు హెచ్చరించారు.

Also Read:మిషన్ బిల్డ్ పేరుతో ప్రభుత్వ భూముల లూటీ: వైసీపీపై దూళిపాళ నరేంద్ర

రాష్ట్ర మూలధనం లాంటి నేలతల్లిని వేలమేస్తూ స్వయంగా సీఎం జగన్ భారీ దోపిడీకి తెరతీస్తుంటే `గేదె చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అన్నట్లు గా వైసీపీ నేతల దోపిడిలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని అతలాకుతలం అవుతుంటే జగన్ మాత్రం ప్రతి అంశంలోనూ దోపిడీకి తెరతీశారని ఆయన ఆరోపించారు.  విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు మద్దతుగా  ఆర్ ఆర్ వెంకటాపురాన్ని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు  మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తితో పాటు మరి కొందరు నేతలను  ఎలా అరెస్టు చేస్తారని కళా ప్రశ్నించారు.

గుడివాడలో భూ కబ్జాలు చేస్తూ గుండాయిజంతో రిజిస్ట్రేషన్ భూముల్లో పాగా వేస్తుంటే పోలీసులు గడ్డం గ్యాంగ్ కి కొమ్ముకాస్తారా అని వెంకట్రావ్ నిలదీశారు. నెల్లూరు జిల్లాలో  బుచ్చిలో ఏఎస్ఐటపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెగడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తే ఇక సామాన్య ప్రజలకు దిక్కేదన్నారు.

తక్షణం పోలీసు బాస్ గుడివాడలో భూ కబ్జాలు, నెల్లూరులో ఏఎస్ఐ పై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రె డ్డి అనుచరులు దౌర్జన్యంపై విచారణ జరిపించి నిందితులకు శిక్ష వేయాలి డిమాండ్ చేశారు.

కాకినాడలో  మడ అడవులను తవ్వేసి పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో భారీ అవినీతికి పాల్పడ్డ వైసీపీ నేతల దుర్మార్గ చర్యలపై  టీడీపీ నిజ నిర్దారణ బృందం ఖచ్చితంగా వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

టీడీపీ పాలనలో పాలనలో పేదల సముద్ధరణకు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళుగా  కొనసాగించి దేశానికి ఆదర్శమైందని ఆయన గుర్తుచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి అధర్మాన్ని నాలుగు పాదాలపై అష్టవంకరులుగా  నడిపిస్తూ అన్ని వర్గాల ప్రజలను కష్ట పెడుతున్నారని కళా ధ్వజమెత్తారు.

Also Read:అది నిరూపిస్తే మీసం తీసుకుని తిరుగుతా...లేదంటే: దేవినేని ఉమకు మంత్రి అనిల్ సవాల్

న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ బాధల్లో సతమతమవుతున్న బడుగులకు అండగా నిలుస్తున్న తెదేపా నేతలపై అక్రమ కేసులు దౌర్జన్యాలకు పాల్పడటం జగన్ ఫాసిస్టు మనస్తత్వానికి నిదర్శనమన్నారు.

కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన నష్టాలు,కష్టాల్లో పేదలకు అండగా నిలిచి భోజనాలు, కూరగాయలు పంపిణీ చేస్తుంటే వైకాపా ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవడం దుర్మార్గమని కళా దుయ్యబట్టారు.

కరోనా విపత్తులో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే వైసీపీ నేతలు మాత్రం బ్లీచింగ్ పేరుతో నాసిరకం సున్నాన్ని సరఫరా చేయడం వైకాపా నేతల దోపిడీకి పరాకాష్ట అన్నారు. కేంద్రం రైతులకు ఇచ్చే సహాయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు రూ.12,500 ఇస్తామని రూ. 5 కోతకోసి ఇవ్వడం రైతులను దగా చేయడం కాదా? అని కళా నిలదీశారు.