Asianet News TeluguAsianet News Telugu

అలా అయితే క్షమాపణ చెబుతా: జగన్‌కి బాబు సవాల్, కుప్పం సభలో అలజడి

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బూతు వ్యాఖ్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. రెండేళ్లుగా తమపై వైసీపీ నేతలు బూతులు మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

Tdp chief Chandrababu Naidu challenges To AP CM Ys Jagan
Author
Kuppam, First Published Oct 29, 2021, 6:26 PM IST

చిత్తూరు: ఏపీ సీఎం జగన్ పై బూతు వ్యాఖ్యలపై టీడీపీ చీఫ్ Chandrababu Naidu సవాల్ చేశారు. రెండేళ్లుగా తమపై Ycp నేతలు బూతులు మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. మీరు తిడితే మేం పడాలా? .. కానీ  మావాళ్లు తిడితే మా ఆఫీసులపై దాడి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

also read:బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు (ఫోటోలు)

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. శుక్రవారం నాడు Kuppamలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. వైసీపీ నేతలు, తమ పార్టీ నేతలు మాట్లాడిన  మాటలను ప్రజల ముందు పెడతామన్నారు. ఒకవేళ తాము తప్పు చేసి ఉంటే ప్రజలకు క్షమాపణ చెబుతానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ విషయమై తాను ఎక్కడికైనా వస్తానని చెప్పారు. తన మంచితనాన్నే ఇంతవరకు చూశారన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై  రాష్ట్రపతికి వివరించినట్టుగా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న తమ పార్టీ కార్యాలయంపై వైసీపీ  దాడికి దిగిందన్నారు.తనపై బాంబులు వేస్తానని  ప్రకటించారన్నారు. బాంబులకు తాను భయపడనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేస్తాం

తమ పార్టీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు.  తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.చట్టపరంగా Police అధికారులు వ్యవహరించాలని ఆయన కోరారు. చట్టపరంగా వ్యవహరించని పోలీసులపై చర్యలు తప్పవన్నారు.తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని శపథం చేస్తున్నానని చెప్పారు.

న్యాయానికి తలొగ్గుతాం.. దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలంతా రెచ్చిపోతే మీ జైల్లు సరిపోవని చంద్రబాబు చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలను కేసులు ఏమీ చేయలేవని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.కుప్పంలో రౌడీలు, గుండాలు ప్రవేశించారని ఆయన ఆరోపించారు.

బాబు సభలో ఉద్రిక్తత

చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వస్తే బాంబు వేస్తానని వైసీపీ నేత సెంథిల్ కుమార్ ఇటీవలనే వ్యాఖ్యలు చేశాడు.  అయితే ఇవాళ కుప్పం సెంటర్ లో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కన్పించాడు. అతను బాంబు తెచ్చాడనే టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఏపీ సీఎం జగన్, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనుమానితుడిని టీడీపీ కార్యకర్తలు అతడిని చితకబాదారు.  కార్యకర్తలను భయపడవద్దని చంద్రబాబు చెప్పారు.. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకొన్నారు. మరోవైపు తమ సభలో అనుమానితుడు ఎలా ప్రవేశించాడని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే ఈ పరిణామాన్ని గమనించిన చంద్రబాబు భద్రతా సిబ్బంది బాబుకు రక్షణగా నిలిచారు.

రెండు సార్లు చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన వాయిదా పడింది. ఎట్టకేలకు ఆయన ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ మంచి విజయాలు సాధించింది. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు కుప్పంలో పర్యటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios