విజయవాడ: అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని విశాఖ శారదా పీఠం ఆనాడే చెప్పిందని అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులే నిదర్శనమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. 

భవిష్యత్ ఊహించే ఏకైక పీఠం శారదా పీఠం అంటూ చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నిర్వహిస్తున్న శారదా పీఠం ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవంలో స్వరూపానందేంద్ర సరస్వతి పొలిటికల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంగా మారింది. 

శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఏపీ సీఎం వైయస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తన హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి వైయస్ జగన్ అంటూ చెప్పుకొచ్చారు. అగ్నిసాక్షిగా చెప్తున్నా వైయస్ జగన్ అంటే తనకు పరమ ప్రాణం అంటూ స్పష్టం చేశారు. 

వైయస్ జగన్ కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. వైయస్ జగన్ సీఎం అయ్యేందుకు విశాఖ శారదాపీఠం ఐదేళ్లు కష్టపడిందన్నారు. విశాఖ శారదాపీఠంలో ఏ చెట్టును అడిగినా, పక్షిని అడిగినా ఆ విషయం చెప్తోందన్నారు. 

ఇద్దరు సీఎంలు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులని, వారిద్దరికి అత్యంత ఇష్టమైన వ్యక్తి స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. మరో పదిహేనేళ్లు జగన్ సీఎంగా ఉంటారని అందుకు శారదా పీఠం సహకరిస్తోందంటూ స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. 

ఒక పీఠాధిపతి రాజకీయ పరమైన కీలక వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఈ వార్తలు కూడా చదవండి

స్వాత్మానందేంద్ర సరస్వతి అంటే జగన్ కు అభిమానం ఎక్కువ: స్వరూపానంద సరస్వతి

జగన్ కోసం ఐదేళ్లు శ్రమించాం, ఆయన నా ఆత్మ: స్వరూపానందేంద్ర సరస్వతి

శారదాపీఠాధిపతి సన్యాస దీక్షలో ఇద్దరు సీఎంలు