ఏపీ శాసనమండలిలో సెలక్ట్ కమిటీ వ్యవహారం మరింత ముదురుతోంది. 14 రోజులు పూర్తి కావడంతో.. సెలక్ట్ కమిటీ ఏర్పాటు ప్రస్తావనే ఉండదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులు ఆమోదం పొందినట్లేనని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.

విచక్షణకు పరిమితులుంటాయని వైసీపీ అంటోంది. అయితే సెలక్ట్ కమిటీపై వైసీపీ వాదనను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెబుతోంది. 14 రోజుల్లో ఆమోదం సాధ్యం కాదని టీడీపీ అంటోంది. మనీ బిల్లులు కావని ప్రభుత్వమే స్పష్టం చేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

Also Read:సెలక్ట్ కమిటీ సాధ్యం కాదు.. ఛైర్మన్‌కు సెక్రటరీ నోట్: టీడీపీ అభ్యంతరం

బిల్లును గవర్నర్ వద్దకు పంపడం నిబంధనలకు విరుద్ధమని తెలుగుదేశం వాదిస్తోంది. చైర్మన్ ఆదేశాలను సెక్రటరీ అమలు చేయాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఛైర్మన్ షరీఫ్ ఆదేశాలను పాటించి కమిటీ ఏర్పాటుపై బులెటిన్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే శాసనమండలి సెక్రటరీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని తెలుగుదేశం హెచ్చరించింది. 

Also Read:ఏపీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలు: సభ్యులు వీరే

సోమవారం సెలక్ట్ కమిటీల ఏర్పాటుపై బులెటిన్ ఇవ్వాలని మండలి సెక్రటరీని టీడీపీ ఎమ్మెల్సీలు కోరారు. అదే సమయంలో ఛైర్మన్ ఆదేశాలు అమలుకాకపోవడంపై ఆయనను ప్రశ్నించారు.

అయితే సెలక్ట్ కమిటీల ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించవంటూ ఛైర్మన్‌కు మండలి సెక్రటరీ నోట్ పంపినట్లుగా తెలుస్తోంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై మీ ఆదేశాలు అమలు సాధ్యం కాదంటూ నోట్‌లో పేర్కొన్నారు. అయితే మండలి కార్యదర్శి నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సెక్రటరీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని నేతలు తెలిపారు.