ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో సెలక్ట్ కమిటీల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సెలక్ట్ కమిటీల ఏర్పాటుపై బులెటిన్ ఇవ్వాలని మండలి సెక్రటరీని టీడీపీ ఎమ్మెల్సీలు కోరారు. అదే సమయంలో ఛైర్మన్ ఆదేశాలు అమలుకాకపోవడంపై ఆయనను ప్రశ్నించారు.

అయితే సెలక్ట్ కమిటీల ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించవంటూ ఛైర్మన్‌కు మండలి సెక్రటరీ నోట్ పంపినట్లుగా తెలుస్తోంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై మీ ఆదేశాలు అమలు సాధ్యం కాదంటూ నోట్‌లో పేర్కొన్నారు. అయితే మండలి కార్యదర్శి నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సెక్రటరీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని నేతలు తెలిపారు. 

Also Read:ఏపీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలు: సభ్యులు వీరే

శాసనమండలిలో  పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు ఆయా సెలెక్ట్ కమిటీలకు ఛైర్మెన్లుగా ఉంటారు. ఆయా కమిటీల్లో ఉండే సభ్యుల పేర్లను ఇవ్వాలని మండలి ఛైర్మెన్ షరీఫ్ లేఖ రాశారు.

ఈ విషయమై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దం సాగింది. శాసనమండలి ఛైర్మెన్  కు టీడీపీ బీజేపీ, పీడీఎఫ్‌లు పేర్లను ప్రకటించాయి.  సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్దమని వైసీపీ అభిప్రాయపడింది.ఈ మేరకు శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్‌కు వైసీపీ లేఖ రాసింది.

సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్‌ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణను మండలి చైర్మన్ నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా,  పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీకి చెందిన సోము వీర్రాజు సభ్యులుగా ఉంటారు. 

Also Read:ప్రాసెస్ పూర్తి కాలేదు, ట్విస్టిచ్చిన షరీఫ్: టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి లోకేశ్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి ఉండగా.. పీడీఎఫ్‌కి చెందిన లక్ష్మణరావు, బీజేపీకి చెందిన మాధవ్‌, వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీల్లో తామూ భాగస్వాములము కాబోమని వైసీపీ  తేల్చి చెప్పింది. మండలి చైర్మన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్‌, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు లేఖ రాశారు.