తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై తూర్పుగోదావరి అర్బన్ జిల్లా ఏఎస్పీ లతా మాధురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె దిశ మహిళా పోలీస్ స్టేషన్‌లో పెట్టిన కేసు రాజకీయ దురుద్దేశంతో కూడినదన్నారు.

గతేడాది డిసెంబర్ 16న మద్యం పాలసీపై చర్చ జరుగుతుండగా బ్రాండెడ్ మద్యం అమ్మకాలు జరపడం లేదని ఆదిరెడ్డి భవానీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు వెల్లువెత్తాయి.

Also Read:టీడీపీ ఎమ్మెల్యేపై అసభ్య కామెంట్స్...దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే భవానీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని.. ఇది ప్రస్తుతం అసెంబ్లీ సెక్రటేరియేట్ పరిధిలో ఉందని లత వివరించారు. ఈ ఘటన జరిగిన 55 రోజుల తర్వాత ఇప్పుడు దిశ చట్టం కింద కేసు నమోదు చేయమనం భావ్యం కాదన్నారు.

దిశ చట్టం అమలు కాకుండా పోలీస్ స్టేషన్లను ఎందుకు ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ప్రశ్నించడం రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని లత ఆరోపించారు. టీడీపీ నేతలు ఇంత గందరగోళ పరిస్ధితులు నెలకొనేలా చేయడంపై ఏం చర్యలు తీసుకోవాలనే విషయమై న్యాయసలహా తీసుకుంటామని ఏఎస్పీ స్పష్టం చేశారు.

Also Read:ఆశావర్కర్లపై వైసీపీ వేధింపులు ఆపాలి: టీడీపీ ఎమ్మెల్యే భవాని

అయితే దిశ ఒక స్ఫూర్తి మాత్రమేనని.. కేసు ప్రమాదకర పరిస్ధితిని బట్టి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని లత వెల్లడించారు. ఆదిరెడ్డి భవానీతో మరో ఇద్దరు మహిళలు కూడా ఫిర్యాదు చేశారని.. అయితే వారిపై జరిగిన సంఘటనలు రాజమండ్రి అర్బన్ పరిధిలో కాదని లతా మాధురి పేర్కొన్నారు. 

కాగా తనపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేశారంటూ ఆదిరెడ్డి భవానీ సోమవారం రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.