అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావర్కర్లపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంతమంద అయితే బెదిరింపులకు పాల్పడుతున్నారని అసెంబ్లీలో ప్రస్తావించారు. 

రాష్ట్రంలో ఆశావర్కర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అన్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆశావర్కర్లను తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. చాలీచాలని జీతాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని అన్ని విధాలుగా ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. 

విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం ప్రజల కోసం పరితపిస్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారు చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో సీఎం వైయస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు జీతాన్ని తక్షణమే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఆదిరెడ్డి భవానీ.