సారాంశం
అమరావతి పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి గురించి వివరించారు. అమరావతి ఒక నగరం కాదని ఇది ఒక శక్తి అని మోదీ చెప్పుకొచ్చారు. మోదీ ఇంకా ఏమన్నారంటే..
పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టిన అనంతరం స్పీచ్ మొదలు పెట్టిన ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టారు. అమరావతి ఒక నగరం మాత్రమే కాదని ఒక శక్తి అని అభివర్ణించారు. అమరావతి స్వప్నం సాకారమవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. అమరావతిని చూస్తుంటే చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోందని మోదీ తెలిపారు.
ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ అంటూ అభివర్ణించారు. దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో ప్రజలను కలవడం ఆనందంగా ఉందన్నారు. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని మోదీ తెలిపారు. ఇవి శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనమన్నారు.
చంద్రబాబును చూసి నేర్చుకున్నాను
చంద్రబాబు మాట్లాడుతూ టెక్నాలజీ గురించి తన నుంచి నేర్చుకుంటానని తెలిపారని కానీ.. తానే చంద్రబాబును చూసి నేర్చుకున్నానని మోదీ అన్నారు. గుజరాత్ సీంగా ఉన్న సమయంలో చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మించడం గురించి తాను తెలుసుకున్నానని మోదీ గుర్తు చేశారు. రికార్డు స్పీడ్‌లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుందన్నారు. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మనం చేయాలి.. మనమే చేయాలి
వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలుకన్నారన్న మోదీ తాను చంద్రబాబు, పవన్ వికసిత్ ఏపీ కోసం కృషిచేస్తామన్నారు. దీనిని మనం చేయాలి.. మనమే చేయాలి అంటూ మోదీ తెలుగులో చెప్పుకొచ్చారు. టెక్నాలజీ, గ్రీన్ఎనర్జీకి అమరావతి కేరాఫ్‌గా మారుతుందన్నారు. పెద్దప్రాజెక్ట్‌లు చేపట్టాలంటే చంద్రబాబుతోనేసాధ్యమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏపీకి గ్రహణం వీడిందని మోదీ చెప్పుకొచ్చారు.
రైల్వే నిధులు భారీగా పెంచాం.
2009-14 వరకు ఉమ్మడి ఏపీకి రూ. 900 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ ఉండేదన్న మోదీ ఇప్పుడు ఒక్క ఏపీ రైల్వే బడ్జెట్ రూ. 9వేల కోట్లపైనే ఉందని తెలిపారు. రైల్వే బడ్జెట్ పెరగడం వల్ల వందశాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తయ్యిందన్నారు. హైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందని, రేణిగుంట-నాయుడిపేట హైవే వల్ల తిరుపతికి వేగంగా చేరుకోవచ్చని తెలిపారు. అమృత్ భారత్ రైలు కూడా ఏపీ నుంచే వెళ్తుందన్న మోదీ ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.